తెలంగాణ

telangana

ETV Bharat / city

BJP Celebrations: భాజపా కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం.. అంబరాన్నంటిన సంబురాలు..

BJP Celebrations: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 4 రాష్ట్రాల్లో భాజపా విజయదుందుబి మోగించడంతో హైదరాబాద్​లో కార్యకర్తల సంబురాలు అంబరాన్నంటాయి. భాజపా రాష్ట్ర కార్యాలయానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంబురాలు చేసుకున్నారు. ఈ ఫలితాలు తెలంగాణ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయని.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చిన విజయం తమదేనని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

BJP leaders Celebrations in hyderabad for winning in 4 states
BJP leaders Celebrations in hyderabad for winning in 4 states

By

Published : Mar 10, 2022, 5:33 PM IST

Updated : Mar 10, 2022, 10:03 PM IST

BJP Celebrations: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తెలిపారు. కేంద్ర నాయత్వానికి ఈ సందర్భంగా బండి సంజయ్​ ధన్యవాదాలు తెలిపారు. ఐదు రాష్ట్రాలకు గానూ.. పంజాబ్​ మినహా మిగతా అన్నింటిలో విజయం దిశగా భాజపా దూసుకెళ్తుండటంతో.. రాష్ట్రంలో కమలం పార్టీ కార్యకర్తలు సంబురాలు అంబరాన్నంటాయి. కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించిన సంబురాల్లో బండి సంజయ్, లక్ష్మణ్, రాజాసింగ్, స్వామి గౌడ్ పాల్గొన్నారు. బండి సంజయ్​ని కార్యకర్తలు భుజానికెత్తుకొని కలియ తిరిగారు. మహిళా కార్యకర్తలు నృత్యాలతో సందడి చేశారు.

భాజపా కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం.. అంబరాన్నంటిన సంబురాలు..

తెలంగాణలోనూ డబుల్​ ఇంజిన్​ సర్కార్​..

దేశంలో భాజపా పని అయిపోయిందన్న కొందరికి.. ఈ ఫలితాలే సమాధానమని బండి సంజయ్​ తెలిపారు. ఈ ఫలితాలతో రాష్ట్రంలోని కార్యకర్తల్లోనూ ఉత్సాహం రెట్టింపయ్యింది. తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

"దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మోదీ కోరుకున్నారు. ఈ ఫలితాలు తెలంగాణ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయి. దేశంలో భాజపా పని అయిపోయిందని కొందరు అన్నారు. యూపీలో 35 ఏళ్ల చరిత్రను యోగి తిరగరాశారు. అవినీతిరహిత సర్కారు కావాలని యూపీ ప్రజలు భావించారు. యూపీలో గుండాయిజాన్ని యోగి రూపుమాపారు. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. సెంటిమెంట్ రగిలించి మరోసారి లబ్ధి పొందాలని కేసీఆర్‌ చూస్తున్నారు. రాష్ట్రంలో భాజపాకు సీట్లు పెరగకపోయినా.. ఓటింగ్ శాతం పెరుగుతోంది. తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ సర్కార్‌ ఇంజిన్ దారుసలాంలో ఉంది. భాజపా సెగతోనే సీఎం ఫామ్‌హౌస్‌ వదలి జిల్లాలు, రాష్ట్రాలు తిరుగుతున్నారు. కేసీఆర్‌ అవినీతిపై ఎప్పటికైనా విచారణ జరుగుతుంది. కేసీఆర్‌ అరెస్టు తప్పదు. తెలంగాణపై భాజపా జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది." - బండి సంజయ్​, భాజపా అధ్యక్షుడు

ఎన్నికలెప్పుడొచ్చినా మేమే గెలుస్తాం..

"5 రాష్ట్రాలకు గానూ 4 రాష్ట్రాల్లో భాజపా విజయ దుందుబి మోగిస్తోంది. యూపీలో కుల ఎజెండాతో ఎన్నికలకు వెళ్లిన పార్టీలను ప్రజలు తిరస్కరించారు. సుపరిపాలన,సంక్షేమ పథకాలు కోరుకొని భాజపాకి పట్టం కట్టారు. దేశం కోసం మోదీ.. యూపీ కోసం యోగి పనిచేస్తున్నారని అక్కడి ప్రజలు నమ్మారు. అఖిలేష్ యాదవ్, కేసీఆర్ మాత్రం కుటుంబం కోసం పని చేస్తున్నారు. యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చి యోగి చరిత్ర సృష్టించారు. యూపీలో ఉన్న సంక్షేమ పథకాలు తెలంగాణలో లేవు. మోదీ నేతృత్వంలో ఇంకా 20 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉంటాం. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన అధికారంలోకి వస్తాం."- లక్ష్మణ్, భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు

చాలా మందికి గుండెలదిరాయి..

ఐదు రాష్ట్రాల్లో ప్రజల ప్రేమ, మోదీ చరిష్మానే భాజపాను గెలిపించాయని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. గెలిచిన వారందరికి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. కులతత్వం, మతతత్వం, డబ్బు.. గెలవడానికి పనిచేయవని ఈటల స్పష్టం చేశారు.

"యూపీలో భాజపా వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది. భాజపా మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తుందని యూపీ ప్రజలు నమ్మారు. ఈ గెలుపుతో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిసిపోయింది. భాజపా గెలుపుతో చాలా మందికి గుండెలదిరాయి. సీఎం కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ.. తాను పాలన సరిగా చేయలేక ఫ్రస్ట్రేషన్​తో భాజపాపై విమర్శలు చేస్తున్నారు." - ఈటల రాజేందర్​, ఎమ్మెల్యే

శ్రేణుల సంబురాలు..

హైదరాబాద్‌ బర్కత్ పుర భాజపా కార్యాలయం వద్ద కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిలు తినిపిస్తూ సంబురాలు నిర్వహించారు. ప్రధాని మోదీని దేశప్రజలంతా ఆదరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. భువనగిరి వినాయక చౌరస్తాలో ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలను హర్షిస్తూ డప్పు వాద్యాలతో కమలం కార్యకర్తలు నృత్యాలు చేశారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని నినదించారు. నిజామాబాద్‌, నిర్మల్‌ భాజపా కార్యాలయాల వద్ద కార్యకర్తలు, నేతలు ఆనందంతో నృత్యాలు చేసి బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 10, 2022, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details