Jithender reddy: భాజపా ఎదుగుదలను ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆక్షేపించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను సైబరాబాద్ సీపీ చదవలేక చదివారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ కారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని జితేందర్‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ నుంచి కార్యకర్తలు.. దిల్లీ వస్తే తన ఇంటికి వచ్చేవారని.. వారికి వసతి కల్పించడం బాధ్యతన్నారు.
మున్నూరు రవి తన వద్దకు వచ్చినప్పుడు ఆయనపై ఎలాంటి నేరారోపణలు లేవని జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మున్నూరు రవికి మాత్రమే తాను వసతి కల్పించానని.. ఆయనతో ఎవరు వచ్చారో తనకు తెలియదని స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. మంత్రిపై కుట్ర ఎందుకు జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ కోసం పోలీసులు పిలిస్తే వెళతానని స్పష్టం చేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ ఫోన్ చేసి అండగా ఉంటామన్నారని చెప్పారు.