ఏపీలోని కడపలో నిర్వహించిన "రాయలసీమ రణభేరి" సభ ఉత్సాహంగా సాగింది. ఇటీవలి 4 రాష్ట్రాల ఎన్నికల్లో దక్కిన విజయోత్సాహంతో... ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా నుంచే భాజపా ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సభలో పాల్గొన్న భాజపా అగ్రనేతలంతా... జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు... నేతల ప్రసంగాలకు కేరింతలు కొట్టారు.
వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా... రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ ప్రాంతం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా... వెనుకబాటుతనాన్ని రూపుమాపలేకపోయారని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కాకపోవడానికి, ఈ ప్రాంత వెనుకబాటుకు నేతల నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రభుత్వంపై పోరాడే భాజపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు.
నీతివంతమైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్... అవినీతి చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నారని ఎంపీ సి.ఎం.రమేశ్ ఆరోపించారు. సీమలో నేతలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కంటే... ఖనిజ సంపద, భూదోపిడీకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాయలసీమ సహా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి బాధ్యత భాజపా తీసుకుంటుందని... వచ్చే ఎన్నికల్లో పార్టీకి అధికారం కట్టబెట్టాలని ప్రజల్ని కోరారు.