తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీ చేయడం కన్నా.. నగర అభివృధ్ధి ముఖ్యమని భావించాం. అందుకే ఈ స్థానాన్ని భాజపాకు వదిలేశాం. ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీతో పాటు నాయకులు, జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలపడటానికే అని జనసైనికులు గమనించాలి. - పవన్‌కల్యాణ్, జనసేన అధినేత
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీ కన్నా నగర అభివృధ్ధి ముఖ్యమని భావించామని, అందుకే ఈ స్థానాన్ని భాజపాకు వదిలేశామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఏపీలోని అరాచక శక్తుల పీచమణచడానికి భాజపా సమాయత్తమవుతోందన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ తరహాలోనే తిరుపతిలోనూ పోరాడుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పవన్‌కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వైకాపా ఆగడాలకు దీటుగా సమాధానం చెబుతామన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఆగడాలను చూస్తూనే ఉన్నామని, వారిని ఎదుర్కోవడానికే భాజపాతో కలిసి సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
నిర్ణయం వెనుక దూరదృష్టి..
తాము ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీతో పాటు నాయకులు, జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలపడటానికే అని జనసైనికులు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి నిర్ణయం వెనుక దూరదృష్టి ఉందని జనసేన శ్రేణులు గుర్తించాలన్నారు. ఏపీ ప్రగతికి, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జెేపీ.నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోశ్లతో తిరుపతి ఉపఎన్నికపై లోతుగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు.