PMFBY News: ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో ప్రధానమంత్రి పంటల బీమా పథకా(పీఎంఎఫ్‌బీవై)న్ని రాష్ట్రంలో అమలుచేయడం లేదు. ఈ పథకం కోసం జూన్‌కల్లా బీమా కంపెనీలను ఎంపిక చేసి జులైలో రైతుల నుంచి ప్రీమియం వసూలు చేయాలి. కానీ, టెండర్లు కూడా పిలవనందున ఇక ఈ సీజన్‌లో అమలు లేనట్లేనని తేలిపోయింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పీఎంఎఫ్‌బీవైలో మార్పులు చేసి ‘బంగ్లా సస్య బీమా యోజన’(బీఎస్‌బీ) పేరుతో తీసుకొచ్చినందున.. దానిపై అధ్యయనం చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ తాజాగా నిర్ణయించింది.
వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోనూ ఈ పథకం అమలుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు సూచించింది. ఈ మేరకు త్వరలో రాష్ట్ర ఉన్నతాధికారుల బృందాన్ని పశ్చిమబెంగాల్ పర్యటనకు పంపాలని కసరత్తు చేస్తున్నారు. ఆలుగడ్డ, చెరకులకు పంటవిలువలో 4.85 శాతం సొమ్మును ప్రీమియంగా బెంగాల్ వ్యవసాయ శాఖ వసూలు చేస్తోంది. ఆహారధాన్యాలు, నూనెగింజల పంటలకు రైతుల తరఫున పూర్తి ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
పరిహారం అందడం లేదు..
పీఎంఎఫ్‌బీవై అమలు వల్ల ఎక్కువ మంది రైతులు పంట నష్టపోయినా పరిహారం రావడం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ భావిస్తోంది. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవడం ప్రతిబంధకంగా మారిందని చెబుతోంది. పైగా వడగండ్లు, పెనుగాలులకు పంట నష్టపోతే తక్షణం 25 శాతం పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రైవేటు బీమా కంపెనీలు అమలుచేయడం లేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది రైతులకు పరిహారం వచ్చేందుకు పంటలబీమా పథకాన్ని ఎలా అమలుచేయాలో అధ్యయనం చేసి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వ్యవసాయశాఖకు సూచించింది.
గతేడాది పశ్చిమబెంగాల్‌లో అమలుచేసిన పథకంతో ఎక్కువ మందికి పరిహారం అందిందని అధికారవర్గాల పరిశీలనలో తేలింది. ఉపగ్రహ చిత్రీకరణ ద్వారా పంటనష్టాలను అంచనా వేసే విషయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సంబంధించి ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చేసిన ప్రయోగాలపైనా వ్యవసాయశాఖ అధ్యయనం చేస్తోంది. బెంగాల్‌లో అధ్యయనం చేశాక బీమా పథకం అమలుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. పీఎంఎఫ్‌బీవైతో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం లేదని ఆయన వివరించారు. మరోవైపు 2018-20 మధ్యకాలంలో పంటలు నష్టపోయిన రైతులకు పీఎంఎఫ్‌బీవై కింద చెల్లించాల్సిన పరిహారం రూ.390 కోట్లను రాష్ట్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది.
ఇవీ చదవండి: