ఏకగ్రీవం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పల్లెల్లో వినిపిస్తున్న పదం. అసలు ఏకగ్రీవం ఎందుకు చేయాలి.. చేస్తే లాభం ఏంటీ..? ప్రభుత్వాలు చెప్పినట్టు నిజంగానే నజరానా వస్తుందా..? రాకపోతే ఏం చేయాలి..? వస్తే ఆ నిధులను దేనికి ఉపయోగించాలి..? అనే ప్రశ్నలు పల్లె పౌరుల మెదళ్లను తొలుస్తున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు కేటాయించే కార్యక్రమం 1960లో రాజస్థాన్ రాష్ట్రం ప్రారంభించింది. ఆ తర్వాత పలు రాష్ట్రాలు దీనిని అమలు చేశాయి. ప్రస్తుతం తెలంగాణ, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2001 నుంచి అమలు చేస్తున్నారు. 2006లోనూ ప్రోత్సాహకాలు ప్రకటించారు. 2013 వచ్చేనాటికి ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం అనేక రెట్లు పెరిగింది.
ఈసారి భారీగా ప్రయోజనాలు
ఉమ్మడి రాష్ట్రంలో 2013 జులైలో పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. జులై 23, 27, 31 తేదీల్లో చేపట్టారు. అప్పట్లో మొత్తం 21,441 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా... అందులో 2,422 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 293 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా... ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 202, నెల్లూరు జిల్లాలో 194 గ్రామ పంచాయతీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం ఈసారి మరింత భారీగా ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. దానికి అనుగుణంగా జీవో నంబర్ 34ని విడుదల చేసింది. గతంలో 2013 నాటి జీవో నం.1274ని సవరించింది. అదనంగా కొత్త కేటగిరీలు చేశారు. గతంలో ఉన్న రెండు కేటగిరీల స్థానంలో ఈసారి 4 తరగతులుగా విభజించి పంచాయతీలకు ప్రయోజనం కల్పిస్తామని సర్కారు చెబుతోంది.
ఎంత జనాభా ఉంటే.. ఎంత ప్రోత్సాహకం..?
రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే ఆ పంచాయతీకి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. గతంలో 2 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలను ప్రత్యేకంగా విభజించలేదు. 2001 నుంచి 5000 లోపు జనాభా ఉండే పంచాయతీలు ఏకగ్రీవమైన పక్షంలో రూ.10 లక్షలు నగదు ప్రోత్సాహం అందిస్తారు. 5001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల నగదు ప్రోత్సాహం అందుతుంది. పదివేల కన్నా అధికంగా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షల నగదు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.
అధికార పార్టీకే 95 శాతం..!