Bathukamma Sarees Distribution : తెలంగాణ మహిళల పండుగైన బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది పథకానికి రూ.333 కోట్లు కేటాయించింది. గతంలోకంటే వేగంగా ఈ ఏడాది పంపిణీ చేపట్టేందుకు జనవరిలోనే తయారీని ప్రారంభించింది. ప్రతి నెలా పది లక్షల చొప్పున ఇప్పటివరకు 90 లక్షల చీరలను తయారు చేశారు. మరో నాలుగురోజుల్లో 20 లక్షల చీరలు ఉత్పత్తి కానున్నాయి. ఈనెల 22 నుంచి జిల్లాలకు చేరవేసేందుకు రాష్ట్ర చేనేత సంస్థ సన్నాహాలు ప్రారంభించింది.
Bathukamma Sarees Distribution in Telangana : సిరిసిల్లలోని 16 వేల మంది నేత కార్మికులకు పనులను అప్పగించింది. ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో రూపొందించారు. ఈ సారి చీరల ప్రత్యేకత డాబీ అంచు ఉండటం. సిద్ధమైనవాటిని ఈ నెల నాలుగో వారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తారు. వచ్చే నెల 25 నుంచి బతుకమ్మ పండుగ ఉంది. అంతకంటే నాలుగు రోజుల ముందే పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో మాదిరిగానే 18 ఏళ్లు దాటిన నిరుపేద మహిళలకు వీటిని పంపిణీ చేస్తారు.