రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు రేపటి నుంచి 20వ తేదీ వరకు నాలుగు గంటలే పని చేయనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి తమ బ్యాంకు పనులు చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.
రేపటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు - బ్యాంకుల పనివేళలు
17:33 May 12
ఉ.8 నుంచి మ.12 వరకు పనిచేయనున్న బ్యాంకులు
ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్నందున బ్యాంకు పని గంటలు, పనివేళల అంశంపై చర్చించేందుకు ఈ ఉదయం జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. దాదాపు గంటపాటు కమిటీ సభ్యులతో చర్చించిన కమిటీ ఛైర్మన్ ఓపీ మిశ్రా, కన్వీనర్ కృష్ణ శర్మలు అందులో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. పరిశీలించిన ప్రభుత్వం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బ్యాంకు పని వేళల్లో మార్పులు రేపటి నుంచి అమలులోకి వస్తాయని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ తెలంగాణ రాష్ట్ర కన్వినర్ శ్రీరాం, ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్ల కాన్ఫడరేషన్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు ఈ పని వేళల్లో మార్పులు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. రొటేషన్ విధానంలో... బ్యాంకు ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవుతారని తెలిపారు.
లాక్‌డౌన్ పొడిగించినట్లయితే బ్యాంకు పని వేళలు మారిన విధంగానే కొనసాగనున్నాయని వివరించారు. వయసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగులు అందరికీ వ్యాక్సిన్ వేయాలని కూడా ప్రభుత్వానికి నివేదించగా ఆ విషయంపై ఏలాంటి నిర్ణయం రాలేదని తెలిపారు.