తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్ సాబ్.. పోలీసు శాఖ ఓకే.. మిగతా శాఖల సంగతేంటి? - సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay Letter to CM KCR : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పోలీసు శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ నేపథ్యంలో.. మిగతా శాఖల్లో పోస్టుల భర్తీ ఎప్పుడంటూ లేఖలో ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాలయాపన లేకుండా అన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు.

Bandi Sanjay Letter to CM KCR
Bandi Sanjay Letter to CM KCR

By

Published : Apr 26, 2022, 12:46 PM IST

Bandi Sanjay Letter to CM KCR : రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు వేడీ రాజుకుంటున్నాయి. తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు పరస్పర విమర్శ బాణాలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా తెరాస-భాజపా నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార గులాబీ పార్టీపై కాషాయం నిప్పులు చెరుగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ కేసీఆర్ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సంక్షేమ పథకాల వైఫల్యం, డబుల్ బెడ్‌రూంలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు, కాళేశ్వరం నీళ్లు, రైతుల కష్టాలు, ధాన్యం కొనుగోళ్లు.. ఇలా ప్రతి అంశంలో అధికార పార్టీని నిలదీస్తున్నారు.

Bandi Sanjay on Job Notifications : ఇందులో భాగంగానే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పోలీసు శాఖ నోటిఫికేషన్‌ జారీ నేపథ్యంలో.. మిగతా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. 8 ఏళ్ల తెరాస పాలనలో కేవలం పోలీసుల పోస్టులే భర్తీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. నియంత పాలనకు అడ్డురాకూడదనే పోలీసుల పోలీస్టుల భర్తీ అని సంజయ్ పేర్కొన్నారు.

Job Notifications in Telangana : ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మూడున్నరేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.1.20 లక్షల భృతి చెల్లించాలని అన్నారు. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న బండి సంజయ్.. కాలయాపన లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని విన్నవించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details