కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను పరిశీలిస్తామని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. హామీ ఇచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు లేఖ రాశారని పేర్కొన్నారు.
తమను ప్రమోట్ చేసేందుకు సహకరించాలని.. విద్యాసంవత్సరం వృథా కాకుండా చూడాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు బండి సంజయ్‌ను కోరారు. కరోనా వేళ పాఠ్యాంశాలపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం వల్ల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యామని, తమను రెండో ఏడాదికి ప్రమోట్ చేయకపోతే విద్యాసంవత్సరం వృథా అవుతుందంటూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బండి సంజయ్‌కు విజ్ఞప్తి చేశారు. తమకు అవకాశం ఇస్తే తొలి ఏడాది ఫెయిలయిన సబ్జెక్టులను రెండో సంవత్సరంలో క్లియర్ చేసుకుంటామని సంజయ్ దృష్టికి తీసుకువచ్చారు.