వైద్యంపై కేంద్ర సర్కార్ జీఎస్టీ తగ్గించడం హర్షణీయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Bandi Sanjay : ప్రజలపై పన్ను భారం తగ్గించిన సర్కార్‌కు కృతజ్ఞతలు - bandi sanjay news
కరోనా వల్ల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలపై పన్ను భారం పడకుండా కేంద్ర సర్కార్ సరైన నిర్ణయాలు తీసుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. వైద్యచికిత్సలపై జీఎస్టీ తగ్గించడంపై హర్షం వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న ప్రజలందరిపై పన్నుల భారం తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకోవడం పట్ల బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్-19తో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే రెండు రకాల మందులకు జీఎస్టీ రద్దు చేశారని వెల్లడించారు. కరోనా ఔషధాలు, పరికరాలు, మందులపై మినహాయింపులు ఇచ్చారని... 12శాతం నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గించారని పేర్కొన్నారు.
రెమ్‌డెసివర్ ఇంజెక్షన్‌కు కూడా 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారని తెలిపారు. హ్యాండ్ శానిటైజర్లు, టెంపరేచర్ చెకింగ్ పరికరాలు, శ్మశానవాటికల్లో ఉండే గ్యాస్ ఎలక్ట్రిక్ ఫర్నేస్పై గతంలో 18 శాతం జీఎస్టీ ఉండేదని.. ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి వాటిని 5 శాతానికి తగ్గించారని చెప్పారు. అంబులెన్స్‌ల రవాణాకు సంబంధించి జీఎస్టీ తగ్గించారని అన్నారు.