తెలంగాణ

telangana

ETV Bharat / city

సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకునేలా చూసే బాధ్యత ఆసుపత్రులదే - కొవిడ్ టీకా పంపిణీ వార్తలు

టీకా పంపిణీకి గడువు సమీపిస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్యశాఖకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు కొవిన్‌ యాప్‌ ముప్పుతిప్పలు పెడుతోంది. మరోవైపు కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు టీకా పొందడానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని వైద్యులు తాము టీకా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది.

As the deadline for vaccine distribution approaches, the medical health department faces new challenges.
సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకునేలా చూసే బాధ్యత ఆసుపత్రులదే

By

Published : Jan 11, 2021, 5:17 AM IST

టీకా పంపిణీకి గడువు సమీపిస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్యశాఖకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు కొవిన్‌ యాప్‌ ముప్పుతిప్పలు పెడుతోంది. మరోవైపు కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు టీకా పొందడానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని వైద్యులు తాము టీకా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. కొందరు ప్రభుత్వ వైద్యులు కూడా ఇదే రీతిలో తమ అభిప్రాయాన్ని ఆసుపత్రి బాధ్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులైన లవ్‌అగర్వాల్‌ తదితరులతో ఆదివారం జరిగిన దృశ్య మాధ్యమ సమీక్షలో తెలంగాణ వైద్యశాఖాధికారులు ఈ అంశాలను ప్రస్తావించారు. అనంతరం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్షలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించారు. వైద్యులు, ఇతర సిబ్బంది కొవిడ్‌ టీకా పొందేలా చూసే బాధ్యత సంబంధిత ఆసుపత్రిపైనే ఉంటుందని పేర్కొంటూ తాజాగా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వైద్యులకూ సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్లు అవగాహన కల్పించాలని తెలిపింది. టీకా తీసుకోవడం స్వచ్ఛందమే అయినా, అందరూ ముందుకువచ్చేలా ప్రోత్సహిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయంగా ప్రత్యేక పుస్తకంలో..


రాష్ట్రవ్యాప్తంగా గత శుక్రవారం నిర్వహించిన ముందస్తు సన్నాహకాల్లో (డ్రై రన్‌) కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌తో ఆరోగ్య సిబ్బంది సమస్యలను ఎదుర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాల్లో టీకా డ్రై రన్‌ నిర్వహించాలని నిర్ణయించినా.. ఈ సమస్యల వల్ల 917 చోట్ల మాత్రమే నిర్వహించగలిగారు. సాఫ్ట్‌వేర్‌ వేగం తగ్గిపోవడంతో.. కొన్నిచోట్ల ఒక్కో లబ్ధిదారుడి సమాచారాన్ని పొందుపర్చడానికి గంటకు పైగా సమయం పట్టింది. దేశవ్యాప్తంగా ఒకేసారి కోట్ల మందికి టీకాలిచ్చేటప్పుడు ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోననే ఆందోళన నెలకొంది. ఇటువంటి సమస్యలొస్తే, లబ్ధిదారులను గంటల కొద్దీ వరుసల్లో నిలబెట్టడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక పుస్తకంలో లబ్ధిదారుల సమాచారాన్ని రాసుకుని, సజావుగా టీకాల పంపిణీని కొనసాగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తర్వాత ఆ వివరాలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిస్తే సులువవుతుందని భావిస్తోంది.

సాధారణ ప్రజల్లో భరోసా నింపేందుకు..


ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 2.90 లక్షల మంది టీకా లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే కొవిన్‌ యాప్‌లో పొందుపర్చారు. సాధ్యమైనంత ఎక్కువమంది వైద్యసిబ్బందికి టీకాలు వేస్తే, ఇతర కేటగిరీల లబ్ధిదారులకు విశ్వాసం కల్పించినట్లవుతుందని వైద్యశాఖ భావిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం, బాధితుల్లోనూ అత్యధికులపై వైరస్‌ పెద్దగా ప్రభావం చూపకపోవడం కారణాల వల్లే కొందరు వైద్యులు ఆసక్తి చూపడంలేదని భావిస్తున్నట్లు వైద్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. అన్ని అంశాలూ సమగ్రంగా పరిశీలించాకే ప్రభుత్వం పంపిణీ నిర్ణయం తీసుకున్నందున ఎవరూ అపోహలకు గురికావద్దంటూ విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవీ చూడండి:నేడు టీకా పంపిణీపై సీఎంలతో ప్రధాని భేటీ

ABOUT THE AUTHOR

...view details