చిన్న చిన్న దుకాణాల్లో.. డిజిటల్ చెల్లింపులు సాధ్యమవుతుంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఆలోచించడం ఏమిటని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు(Ap High court) ప్రశ్నించింది. డిజిటల్ చెల్లింపు విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు.
Ap High court : మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు ఆలోచించడం ఏంటి? - ap high court news
మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టేందుకు ఆలోచించడం ఏమిటని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు(Ap High court) ప్రశ్నించింది. డిజిటల్ చెల్లింపు విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారని.. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ న్యాయవాది కిరణ్ కోర్టుకు తెలిపారు.
అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎస్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపింది.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన దాసరి ఇమ్మాన్యుయేల్ హైకోర్టు(Ap High court)లో పిల్ వేశారు. న్యాయవాది నాగ ప్రవీణ్ వాదనలు వినిపిస్తూ.. డిజిటల్ చెల్లింపుల విధానానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఆమోదం ఉందన్నారు. ఈ తరహా చెల్లింపులను ప్రోత్సహించేందుకు జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలను పర్యవేక్షిస్తున్న బేవరేజ్ కార్పొరేషన్ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయడం లేదని చెప్పారు.