APSRTC CHARGES HIKE : డీజిల్ సెస్ పేరుతో ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణికుల్ని బాదేసింది. స్వల్పంగానే పెంచుతున్నామని చెబుతూ భారీగానే భారం మోపింది. ఒక్కో ప్రయాణికుడిపై సర్వీసును బట్టి రూ.5, రూ.10 చొప్పున డీజిల్ సెస్ వేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు విలేకర్ల సమావేశంలో చెప్పారు. అధికారిక ప్రకటనా విడుదల చేశారు. కానీ ధరల పెంపునకు సంబంధించి ఆర్టీసీ జిల్లా అధికారులకు పంపిన మార్గదర్శకాలు దానికి భిన్నంగా ఉన్నాయి.
అధికారిక ప్రకటన ప్రకారం.. దూరంతో సంబంధం లేకుండా ఒక టికెట్‌పై సర్వీసును బట్టి రూ.5 లేదా రూ.10 మాత్రమే భారం పడాలి. కానీ జిల్లాలకు పంపిన సర్క్యులర్ ప్రకారం... కిలోమీటర్లను బట్టి ఛార్జీలు పెంచినట్టుగా ఉంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో కి.మీ.కి 10 పైసల చొప్పున, ఏసీ సర్వీసుల్లో కి.మీ.కి 10 పైసల నుంచి 20 పైసల వరకు ఛార్జీలు పెంచారు. దీంతో దూరం పెరిగే కొద్దీ వడ్డనా పెరిగింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో దూరాన్ని బట్టి కనిష్ఠంగా రూ.5 గరిష్ఠంగా రూ.15 వరకు ఛార్జీ పెరిగింది. ఏసీ సర్వీసుల్లో ఒక్కో టికెట్‌పై మొత్తం రూ.10 మాత్రమే పెరగాల్సి ఉండగా.. కిలోమీటర్ల లెక్కన పెంపు వర్తింపజేయడంతో దూర ప్రాంత సర్వీసుల్లో ఛార్జీ భారీగా పెరుగుతోంది.
* ఉదాహరణకు.. వెన్నెల-30 సర్వీసులో కిలోమీటరుకు ఛార్జీ 20 పైసల చొప్పున పెంచారు. అంటే విజయవాడ- బెంగళూరు సర్వీసులో ఒక్కో టికెట్‌పై రూ.120 వరకు ఛార్జీ పెరిగింది.
* నైట్ రైడర్ (సీట్) సర్వీసుకు కి.మీ.కు 20 పైసల చొప్పున పెరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.55 పెరుగుతోంది.
* విజయవాడ నుంచి విశాఖపట్నం 345 కి.మీ. ఉండగా రూ.70 ఛార్జీ పెరుగుతోంది.
* ఇంద్ర సర్వీసులో కి.మీ.కు 10 పైసల చొప్పున పెంచారు. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.30, విశాఖకు 35 వరకు పెరగనుంది.
* డీజిలు పన్ను పెంచడం వల్ల ప్రయాణికులపై ఏటా రూ.720 కోట్లు మాత్రమే భారం పడుతుందని అధికారులు చెప్పినా... కిలోమీటర్ల లెక్కల్ని బట్టి చూస్తే ఆ భారం ఇంకా భారీగానే ఉండనుంది. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో స్టేజీల ఆధారంగా..
* పల్లెవెలుగులో 5 కి.మీ.కు (మొదటి స్టేజీ) కనీస ఛార్జి రూ.5 నుంచి రూ.10కి పెంచారు. ఆ తర్వాత అయిదేసి కి.మీ. చొప్పున 20 కి.మీ (4వ స్టేజీ) వరకు ఇప్పుడున్న ఛార్జీ కంటే రూ.5 పెరిగింది. అయితే 25 కి.మీ.దూరానికి (5వ స్టేజికి) ప్రస్తుతం రూ.20 ఉండగా దానిని రూ.30 చేశారు. 50 కి.మీ.దూరానికి (పదో స్టేజీకి) ప్రస్తుతం రూ.35 ఉండగా, దానిని రూ.50 చేశారు. ఇలా కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.15 వరకు పెంచారు. అల్ట్రా పల్లెవెలుగులోనూ ఇలాగే ఛార్జీలు పెరిగాయి.
* సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో 2 కి.మీ. (ఒకటో స్టేజీ) వరకు కనీస ఛార్జి రూ.5 ఉండగా, దానిని రూ.10 చేశారు. తర్వాత 4 కి.మీ. (రెండో స్టేజి)కి రూ.10 ఛార్జీని రూ.15కి పెంచారు. 10 కి.మీ. దూరానికి (5వ స్టేజీకి) రూ.10 ఉండగా రూ.20కి పెంచారు. 16 కి.మీ.దూరానికి (8వ స్టేజీకి) రూ.15 ఛార్జీ ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.30కి చేరింది.
* తిరుపతి- తిరుమల ఘాట్‌లో తిరిగే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రస్తుత ఛార్జి రూ.65 ఉండగా, దానిని రూ.75కి, పిల్లలకు రూ.40 నుంచి రూ.45కి పెంచారు.
పెరిగిన కనీస ఛార్జీలు ఇలా..
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఇప్పటి వరకు కనీస ఛార్జి రూ.5 ఉండగా, దానిని రూ.10 చేశారు. ఎక్స్‌ప్రెస్‌లో రూ.15, డీలక్స్, అల్ట్రా డీలక్స్‌లో రూ.20, సూపర్ లగ్జరీలో రూ.30, ఏసీ ఇంద్ర, గరుడ, అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్, నైట్ రైడర్ (సీట్)లో రూ.40, నైట్ రైడర్ (బెర్త్), వెన్నెల సర్వీసుల్లో రూ.70 చొప్పున కనీస ఛార్జీగా పెంచారు.
ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో మాత్రమే భద్రతా సెస్ (సేఫ్టీ సెస్) ఉండేది. తాజాగా పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లోనూ దీనిని అమల్లోకి తెచ్చారు. ఈ రూపంలో ప్రయాణికుడిపై టికెట్‌పై రూపాయి చొప్పున రాబట్టనున్నారు. జాతీయ రహదారులపై వెళ్లే బస్సుల్లో ప్రయాణించేవారి నుంచి టోల్ ఫీజును, టికెట్ ధరలోనే కలిపి తీసుకుంటారు. తాజాగా ఇప్పుడున్న టోల్‌ఛార్జీ కంటే.. ఒక్కో టోల్‌ప్లాజాకు రూపాయి చొప్పున అదనంగా పెంచారు.
ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ సెస్
ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ సెస్ విధించనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఒక్కో ప్రయాణికుడిపై ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో రూ.5, సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.10 చొప్పున, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ.2తోపాటు భద్రతా సుంకం (సేఫ్టీ సెస్) కింద మరో రూపాయి కలిపి మొత్తం రూ.3 పెంచినట్లు వివరించారు. చిల్లర సమస్య లేకుండా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కూడా టికెట్‌పై రూ.5 చొప్పున (రౌండ్ ఫిగర్) ఛార్జీ పెరిగిందన్నారు. పెంచిన ఛార్జీలు గురువారం ఉదయం తొలి సర్వీసు నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో బుధవారం వారు విలేకర్లతో మాట్లాడారు. ‘డీజిల్ సుంకం వల్ల ఏడాదికి రూ.720 కోట్ల మేర అదనంగా వస్తుందని అంచనా వేస్తున్నాం. ఆర్టీసీలో 2019 డిసెంబరులో ఛార్జీలు పెంచాం. అప్పట్లో డీజిల్ లీటరు రూ.67 ఉండేది. ఇపుడు రూ.107కి చేరింది. ఆ భారాన్ని కొంత తగ్గించుకునేందుకే డీజిల్ సెస్ అమలు చేస్తున్నాం. నిత్యం ఆర్టీసీ 8 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తుండగా, 2019 ధరలతో పోలిస్తే ప్రస్తుతం రోజుకు రూ.3.2 కోట్లు అదనంగా భారం పడుతోంది. టికెట్‌పై నిర్వహణ ఖర్చు కూడా రాకపోతే పూర్తిగా నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో డీజిల్ సెస్ విధించాం. ఇప్పుడున్న డీజిల్ ధరలతో పోలిస్తే ఛార్జీలను 32 శాతం పెంచాలి. అంతమేర ప్రజలపై భారం వేయలేదు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లలో ఆర్టీసీకి రూ.5,680 కోట్లు నష్టం వచ్చింది’ అని వివరించారు.
ఆర్టీసీని రక్షించుకునేందుకే: మంత్రి విశ్వరూప్
చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీని రక్షించుకునేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ధరలు స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. 2019లో డీజిల్ ధర రూ.67 ఉన్నపుడు ఒకసారి పెంచాం, ప్రస్తుతం రూ.100 పైబడటంతో గత్యంతరం లేకే ధరలు పెంచామనీ, ప్రజలు అర్థం చేసుకోవాలనీ కోరారు.