ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు అయిన పంచాయతీ వ్యవస్థలు ఎంత బలంగా ఉంటే.. మిగిలిన వ్యవస్థలన్నీ మరింత సమర్థంగా పనిచేయడానికి వీలుంటుందని... ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. జిల్లాల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో రమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు.
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, మరింత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు ఎస్ఈసీ సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలపై గుడ్డిగా నిర్ణయం తీసుకోమని వివిధ కోణాల్లో పరిశీలించిన అనంతరం తీసుకొంటామన్నారు. ఇదే సమయంలో తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనన్న ఆయన.. రాజ్యాంగం నిర్దేశించిన పరిధి మేరకు తన విధులను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. అదే పద్ధతిలో ప్రక్రియలో నిమగ్నమైన ఇతర అధికారులు, సిబ్బంది పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పిన నిమ్మగడ్డ.. అలానే చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాని పక్షంలో వారు మరింత సమర్థంగా బాధ్యతలు నిర్వహించేందుకు.. తన విశేషాధికారాలను తప్పక వినియోగిస్తానని.. ఇందులో ఎటువంటి సంశయం లేదని స్పష్టం చేశారు.