రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టులో విచారణ అక్టోబరు 5వ తేదీకి వాయిదా పడింది. అనుబంధ పిటిషన్లపైనా కౌంటరు దాఖలు చేయాలని సోమవారం విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరికొన్ని వ్యాజ్యాల్లో లేవనెత్తిన తాజా అంశాలపై కౌంటరు వేయాలని, అవసరం లేదనుకుంటే ఇప్పటికే దాఖలు చేసిన కౌంటరును మిగిలిన వ్యాజ్యాలకు అన్వయిస్తూ (అడాప్షన్) మెమో వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. విచారణను భౌతికంగా నిర్వహించాలా... వీడియో సమావేశం ద్వారా చేపట్టాలా? అవసరాన్ని బట్టి ఆ రెండు విధానాల్లో (హైబ్రీడ్) జరపాలా అనే విషయంపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
రాజధాని అమరావతికి సంబంధించి కమిటీలు ఇచ్చిన నివేదికలు, శాసనసభ, మండలిలో బిల్లులు ప్రవేశపెట్టడం, తదనంతరం ప్రభుత్వం తీసుకొచ్చిన పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన సుమారు 93 వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. రాజధాని వ్యవహారంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు యథాతథ స్థితి (స్టేటస్ కో) ఆదేశాలు అమల్లో ఉంటాయని గత విచారణలోనే హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ప్రాజెక్టుల స్థాయి నివేదికలివ్వాలి..
యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉండగా విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ కొండపై ఏపీ రాష్ట్ర వసతి గృహ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కౌంటరు దాఖలు చేయలేదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిదేష్ గుప్తా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘అమరావతిలో అన్ని ప్రాజెక్టుల స్థాయి నివేదికలు సమర్పించేలా అధికారులను ఆదేశించాలి. 2019 జూన్ తర్వాత ప్రాజెక్టు పనుల నుంచి ఎంత మంది కాంట్రాక్టర్లను తొలగించారు? 2015 నుంచి అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసిన వివరాలు సమర్పించేలా ప్రతివాదులను కోరాలి. ప్రభుత్వం తీసుకున్న తాజా విధానపరమైన నిర్ణయంవల్ల ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావం, కలిగిన నష్టంపై నివేదికను సమర్పించేలా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌ను ఆదేశించాలి’ అని ఆయన కోరారు.