పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విస్మరించి... ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ ఇచ్చిందని, అది చెల్లుబాటు కాదని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. సుప్రీం తీర్పు... నాలుగు వారాల గరిష్ఠ కాలపరిమితిని మాత్రమే సూచిస్తుందని ఎస్‌ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే పోలింగ్ ముగిసిందని, ఎన్నికలకు సుమారు రూ.159 కోట్లు ఖర్చయిందన్నారు. ఓట్లు లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌తోపాటు జనసేన కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు, భాజపా నేత పాతూరి నాగభూషణం దాఖలు చేసిన వ్యాజ్యాల్లోనూ వాదనలు పూర్తయ్యాయి. అన్ని వ్యాజ్యాల తీర్పును వాయిదా వేస్తున్నట్లు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ప్రకటించారు.
సింగిల్ జడ్జి విచారణ జరపొచ్చు
మంగళవారం జరిగిన విచారణలో వర్ల రామయ్య తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ‘నాలుగు వారాల ముందు కోడ్ విధించనందున ఆ నోటిఫికేషన్ చెల్లదు. ధర్మాసనం విచారణ జరపాలన్న ఏపీ ఎస్‌ఈసీ వాదనలు సరికాదు. సీజే నేతృత్వంలోని ధర్మాసనం.. అంతిమంగా సింగిల్ జడ్జి విచారణ జరపాలని తిప్పిపంపింది’ అన్నారు.
ధర్మాసనం విచారించాలి:
ఏపీ ఎస్‌ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదిస్తూ.. ‘జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వర్ల రామయ్య పాల్గొనడం లేదు. వ్యక్తిగత ప్రయోజనం లేనప్పుడు అది ప్రజాహిత వ్యాజ్యం అవుతుంది. దానిపై ధర్మాసనమే విచారించాలి. కరోనా కారణంగా గతేడాది మార్చి 15న స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసిన ఎస్‌ఈసీ.. కోడ్ ఎత్తివేయకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయని ఏపీ ప్రభుత్వం చెప్పడంతో సుప్రీంకోర్టు కోడ్‌ను సడలించింది. పోలింగ్ తేదీకి 4వారాల ముందు కోడ్ విధించాలంది. ఆ 4వారాలు గరిష్ఠ కాలపరిమితినే సూచిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకూ నాలుగు వారాలు ముందుగా కోడ్ విధించలేదు. ఎన్నికలను రద్దుచేస్తే మళ్లీ నిర్వహణకు మరో రూ.150 కోట్లు ఖర్చుచేయాలి. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతించండి’ అని కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘మా వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను ఆపారు. ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపునకు అవకాశం ఇవ్వండి’ అని కోరారు.
తాజా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశించండి
జనసేన తరఫున న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదిస్తూ.. ‘రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని తీసుకోకుండా ఎన్నికల కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన రోజే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిచిపోయిన దశ నుంచి నిర్వహించేందుకు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో నామినేషన్ల దాఖలును అధికారపార్టీ వారు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని అప్పటి ఎస్‌ఈసీ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ప్రక్రియను రద్దు చేసి, తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశించండి’ అని కోరారు. భాజపా న్యాయవాది సైతం తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశించాలని అభ్యర్థించారు.
ఇదీ చదవండి:కమలరథం దూకుడుకు పగ్గాలు