తెలంగాణ

telangana

ETV Bharat / city

AP HC on Justice Chandru: జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం - జస్టిస్‌ చంద్రు తాజా వార్తలు

AP HC on Justice Chandru Comments : మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని ఘటనలు, కొందరు న్యాయమూర్తులపై అభ్యంతరం ఉంటే ఆ విషయం మేరకే పరిమితమై పోరాడాలి తప్ప..హైకోర్టు మొత్తాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నించింది. కొంతమంది జ్యుడిషియల్‌ సెలబ్రిటీలు లైమ్‌లైట్‌ (వెలుగు)లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని.. అలాంటి వెలుగులను ఆపేస్తామని వ్యాఖ్యానించింది.

AP High court, ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

By

Published : Dec 14, 2021, 9:09 AM IST

AP HC Fire On Justice Chandru Comments : మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. హైకోర్టు మొత్తాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నించింది. కొన్ని ఘటనలు, కొందరు న్యాయమూర్తులపై అభ్యంతరం ఉంటే ఆ విషయం మేరకే పరిమితమై పోరాడాలి తప్ప.. హైకోర్టు మొత్తంపై నింద మోపడం సరికాదంది. ప్రజల ప్రాథమిక, మానహ హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టు ఆదేశాలిస్తుంటే.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో పోరాడాల్సి వస్తోందని జస్టిస్‌ చంద్రు అనడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించింది. రాష్ట్రంలో పరిస్థితుల గురించి అవగాహన లేకుండా ఆయన మాట్లాడినట్లుందని.. ఆ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు నిరాధారమని, హైకోర్టు ప్రతిష్ఠను దిగజార్చడమేనని స్పష్టం చేసింది. 'జై భీమ్‌' సినిమాలో న్యాయవాదిగా కథానాయకుడి పాత్ర చూశాక.. జస్టిస్‌ చంద్రుపై గౌరవం పెరిగిందని, విజయవాడ వచ్చి ఏపీ హైకోర్టుపై చేసిన వ్యాఖ్యలతో ఆయనపై గౌరవం పోయిందని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.

డాక్టర్‌ సుధాకర్‌పై సినిమా తీయించండి

AP High Court on Justice Chandru Comments : సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను మాటలతో చెప్పనలవికాని విధంగా పోస్టులు పెడుతుంటే సీబీఐతో కేసు పెట్టించి, దర్యాప్తు చేయించడం తప్పెలా అవుతుందని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రశ్నించారు.

Justice Chandru Comments : "నర్సీపట్నం మత్తువైద్య నిపుణులు డాక్టర్‌ సుధాకర్‌ను విశాఖ పోలీసులు దారుణంగా కొట్టి హింసించారు. ఆయన (జస్టిస్‌ చంద్రు) విశాఖ వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి సుధాకర్‌ వ్యవహారంలో మానవ హక్కుల ఉల్లంఘనపై మంచి డైరెక్టర్‌తో సినిమా తీయించాలి. పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్వహిస్తుంటే వాటిని తొలగించాలని ఆదేశాలిస్తే ఏడాది వరకు అధికారులు కన్నెత్తి చూడలేదు. సుమోటోగా కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభించాక తొలగించారు. ఇలాంటి చర్య పేద విద్యార్థుల హక్కులను కాపాడటం కాదా ? ప్రభుత్వం ఉపాధి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పలువురు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అలాంటి ఘటనలకు పాల్పడొద్దు.. న్యాయం జరుగుతుందని వారికి కోర్టు విజ్ఞప్తి చేయలేదా ? పౌరుల పట్ల ఠాణాల్లో జరిగే వేధింపులే హక్కుల ఉల్లంఘన కాదు. సమాజంలో చాలారకాలుగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించడంలో న్యాయస్థానాలది కీలకపాత్ర. కోర్టు తీర్పులపై అభ్యంతరం ఉంటే అప్పీల్‌కు వెళ్లాలి. అంతే కానీ హక్కుల రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న హైకోర్టుపై అనుచితంగా ఎలా మాట్లాడతారు ? జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యలపై సుమోటోగా క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాద్దామనుకున్నా. ఆయన సామాజిక పరిస్థితి, వయసు, న్యాయవాదిగా సమాజానికి చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని లేఖ రాయాలనే ఆలోచన విరమించుకున్నా" అని జస్టిస్‌ దేవానంద్‌ చెప్పారు.

AP High Court News : హైకోర్టు న్యాయమూర్తిగా తాను బాధ్యతలు చేపట్టాక 4 వేలకు పైగా కేసులను పరిష్కరించానని, న్యాయమూర్తిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించానని ఏ ఒక్క కేసులో రుజువు చేసినా తక్షణం బాధ్యతల నుంచి తప్పుకొంటానన్నారు. ప్రతి వ్యవస్థలోనూ ఒకటి రెండు లోపాలుంటాయని, అంతమాత్రాన వ్యవస్థ అంతటికీ దురుద్దేశాలు ఆపాదించడం సమర్థనీయం కాదని చెప్పారు. తమకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యానించినా తాము పత్రికా సమావేశాలు పెట్టి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. లేదంటే తమపై వచ్చిన ఆరోపణకు గట్టి జవాబిచ్చేవారమని వ్యాఖ్యానించారు.

ప్రాచుర్యంలో ఉండేందుకే ఇలాంటి వ్యాఖ్యలు

ఇటీవల ఓ పెద్దమనిషి ఏపీ హైకోర్టు గురించి చేసిన వ్యాఖ్యలను తాము పత్రికల్లో చూశామని.. మానవ హక్కుల దినోత్సవం గురించి మాట్లాడటానికి వచ్చిన ఆయన దానికే పరిమితమై ఉండాల్సిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొంతమంది జ్యుడిషియల్‌ సెలబ్రిటీలు లైమ్‌లైట్‌ (వెలుగు)లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారంది. అలాంటి వెలుగులను ఆపేస్తామని వ్యాఖ్యానించింది. ఆ వెలుగు మంచిది కాదని, ఎక్కువ రోజులు మిగలదని పేర్కొంది. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడి హైకోర్టు గురించి మాట్లాడటం ఏమిటని నిలదీసింది. ఏ పనిమీద వచ్చారో.. దాని పరిధి మరిచిపోయినట్లున్నారని వ్యాఖ్యానించింది. జడ్జిల వల్లా కొన్ని తప్పులు జరగొచ్చనీ, వారూ మానవమాత్రులేనని తెలిపింది. న్యాయమూర్తులకు రక్షణ ఉంటుందని గుర్తుచేసింది. హైకోర్టు తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ స్పందిస్తూ.. ఓటీటీలో సినిమాలకు నెల తర్వాత ఆదరణ తగ్గుతుందని, దానిని 100 రోజులు కొనసాగించడానికి ప్రేక్షకులను ఆకర్షించేలా విశ్రాంత న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details