తెలంగాణ

telangana

ETV Bharat / city

'విశ్వాసం లేకుంటే ఏపీ హైకోర్టు మూసేయమనండి'

న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో కోర్టులపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. పోస్టింగ్​ల వెనుక కుట్ర తేలుస్తామని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థపై నమ్మకం లేకపోతే హైకోర్టును మూసేయాలని పార్లమెంట్​కు వెళ్లి కోరాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన అమలుకాకపోతే.. ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని వినియోగిస్తామని హెచ్చరించింది. న్యాయవ్యవస్థ నిరుపయోగమైతే సివిల్ వార్​కు దారితీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

ap high court
ap high court

By

Published : Oct 2, 2020, 6:52 AM IST

న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించేది లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టును అపకీర్తి పాల్జేస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన అభ్యంతరకర పోస్టింగ్​ల వెనుక కుట్ర కోణం ఉందా అనేది తేలుస్తామంది. ఎవరి ప్రభావం లేకుండా సాధారణంగా న్యాయమూర్తులను ఎవరూ దూషించరని వెల్లడించింది. న్యాయవ్యవస్థపై ఎవరికైనా విశ్వాసం లేకపోతే పార్లమెంట్​కు వెళ్లి ఏపీలో హైకోర్టును మూసేయమని కోరడం ఉత్తమం అని ఘాటుగా వ్యాఖ్యానించింది. జడ్జీలను అవమానపరుస్తారా? అని కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదా రూల్ ఆఫ్ లా అమలుకాకపోతే .. ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని వినియోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరిపై ఉందని కోర్టు తెలిపింది.

సివిల్​ వార్​కు దారితీస్తుంది

ఈ తరహా పోస్టింగ్​లను అనుమతించవద్దని సామాజిక మాధ్యమ కంపెనీల తరఫు సీనియర్ న్యాయవాదులకు సూచించింది. ప్రజాస్వామ్యం మూడు స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలపై ఆధారపడి ఉంటుందని గుర్తు చేసింది. జ్యుడీషియరీ స్తంభం నిరుపయోగం అయితే సివిల్ వార్‌కు దారి తీస్తుందని తెలిపింది. న్యాయవ్యవస్థపై నమ్మకం లేదనుకున్ననాడు ప్రతి ఒక్కరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఇతరులను కూడా గౌరవించాలని తెలిపింది. న్యాయమూర్తులపై ఆ తరహా ఆరోపణలు చేసిన నేపథ్యంలో హైకోర్టే వ్యాజ్యం దాఖలు చేయాల్సి వచ్చిందని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించింది.

ఫిర్యాదు చేసినా చర్యలు లేవు

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడేందుకు తమ వంతు సహకారం, సలహాలు ఇస్తామని సీనియర్ న్యాయవాదులు హరీశ్​ సాల్వే, సజన్ పూవయ్య తదితరులు కోర్టుకు తెలిపారు. కేసుల నమోదుకు సంబంధించి సీఐడీ వేసిన ఆదనపు అఫిడవిట్ పరిశీలించేందుకు విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. పలు విషయాల్లో తీర్పులు వెల్లడించాక హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొంటూ హైకోర్టు అప్పటి ఇన్​ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

స్వీయ క్రమబద్ధీకరణ పాటించేలా ఆదేశాలు

న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టులు పెట్టకుండా స్వీయ క్రమబద్ధీకరణ పాటించేలా ఆయా సామాజిక మాధ్యమ కంపెనీలను ఆదేశించాలని కోరారు. తాజాగా ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. సామాజిక మాధ్యమ కంపెనీల తరఫు న్యాయవాదులు కొందరు కౌంటర్ వేశామన్నారు. మరికొందరు ఇంకా వేయాల్సి ఉందన్నారు. మరోవైపు సీఐడీ ఎన్ని కేసులు నమోదు చేసింది, ఏ తరహా కేసులు నమోదు చేసిందనే విషయాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.

ఇదీ చదవండి :రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం: సీఎం

ABOUT THE AUTHOR

...view details