తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Struggle for Debts: అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం తంటాలు..

AP Struggle for Debts: అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం తంటాలు పడుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కార్పొరేషన్ల రుణాలకు సరైన సహకారం అందడం లేదని తెలిసింది. బహిరంగ మార్కెట్‌ నుంచి అందే పరిస్థితీ ఉన్నట్లు తెసుస్తోంది. ఈ నేపథ్యంలో రుణాల పొందేందుకు సర్కారు ఆపసోపాలు పడుతోంది.

Debts
Debts

By

Published : Feb 12, 2022, 11:28 AM IST

అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం తంటాలు..

AP Struggle for Debts: ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం తిప్పలు పడుతోంది. ఈ చివరి త్రైమాసికం రుణాలతో పాటు, వివిధ కార్పొరేషన్ల నుంచి రుణాలు పొందేందుకు ఆపసోపాలు పడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కార్పొరేషన్ల రుణాలకు సరైన సహకారం అందడం లేదని తెలిసింది. అప్పుల విషయంలో సహకరించాలంటూ కేంద్ర పెద్దలతో రాష్ట్ర ప్రతినిధులు, అధికారులు తరచూ మంతనాలు జరుపుతున్నారు. ఈ రుణాలపై రిజర్వు బ్యాంకు కూడా దృష్టి సారించినట్లు సమాచారం. అనేకసార్లు దిల్లీ పర్యటనల అనంతరం కొంతమేర రుణానికి అనుమతులు లభించాయి.

జనవరిలో రూ.5,000 కోట్లకు పైగా బహిరంగ మార్కెట్‌ రుణ ప్రతిపాదనలున్నా కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే రాష్ట్రం సమీకరించగలిగింది. చివరి త్రైమాసికంలో రూ.27,325 కోట్ల మేర రుణ అనుమతులు కోరితే కొంతవరకే అనుమతులు దక్కాయి. ఫిబ్రవరి 8న రూ.2వేల కోట్ల రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో రూ.2 వేల కోట్ల రుణం కోసం సెక్యూరిటీల వేలానికి సిద్ధమయింది. ప్రభుత్వం ఇంతవరకు బహిరంగ మార్కెట్‌ నుంచి దాదాపు రూ.40,500 కోట్ల రుణాలు స్వీకరించింది. రూ.వేల కోట్ల రుణాలు సమీకరిస్తున్నా ఇప్పటికే చేసిన పనులకు పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. నిధుల చెల్లింపు సరిగా లేక అనేకచోట్ల పనులు కూడా ఆగిపోయాయి. ఉద్యోగులకే వివిధ రూపాల్లో రూ.2,000 కోట్ల వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఏ నెలలోనూ జీతాలు, పింఛన్లు సకాలంలో చెల్లించలేకపోతున్నారు.

అదనపు రుణ యత్నాలకు అడ్డు!

ఏపీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ కార్పొరేషన్ల నుంచి అదనపు రుణాలు పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీల పరిమితిని రెట్టింపు చేసేసింది. ఈ రుణాలకూ రిజర్వుబ్యాంకు ప్రతినిధులు అడ్డుచక్రం వేస్తున్నట్లు తెలిసింది. అంతకుముందు ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 90 శాతం మించకుండా మొత్తం కార్పొరేషన్ల గ్యారంటీలు ఉండాలనేది నిబంధన. అది దాటిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ పరిమితిని రెట్టింపు చేస్తూ చట్ట సవరణ చేసింది. ఆ మేరకు కొన్ని కార్పొరేషన్లకు అదనపు గ్యారంటీలూ ఇచ్చింది. ఏపీఎస్‌డీసీ, ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌ రుణ వ్యవహారాలపై కేంద్ర ఆర్థికశాఖ, రిజర్వుబ్యాంకు, కాగ్‌లకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి.

జోక్యం చేసుకున్న రిజర్వుబ్యాంకు..

రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌డీసీ అప్పులు తీసుకుంటోందన్న ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం ఇప్పటికే పేర్కొంది. ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌ విషయంలో రిజర్వుబ్యాంకు కూడా జోక్యం చేసుకుంది. కార్పొరేషన్లు రుణాలు కోరినా రిజర్వుబ్యాంకు ప్రతినిధులు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత చర్చల్లో అధికారులు పేర్కొంటున్నారు. అప్పులపై కేంద్రానికి, కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలోనే అప్పులకు అనుమతులు ఇచ్చే విషయంలో రిజర్వుబ్యాంకు ప్రతినిధులు తెరపైకి వచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రూ.42వేల కోట్ల రుణానికి వినతి: బహిరంగ మార్కెట్‌ రుణం కింద జీఎస్‌డీపీలో 4 శాతానికి.. అంటే రూ.42,472 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. చివరి త్రైమాసికంలో రావాల్సిన సుమారు రూ.6,900 కోట్లు, మూలధన అనుసంధాన నిధులు రూ.2,655 కోట్లతో పాటు గతంలో కోత పెట్టిన రూ.17 వేల కోట్లకు పైగా కలిపి రూ.27,325 కోట్ల రుణ అనుమతివ్వాలని డిసెంబర్‌లోనే రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఆ స్థాయి రుణాలకు కేంద్రం నుంచి అనుమతులు లభించలేదని సమాచారం.

ప్రతి నెలా సొంత పన్నులు, కేంద్రం ఇచ్చే నిధులకు తోడు రూ.5,000 కోట్లకు పైగా అప్పు తీసుకుంటున్నారు. అయినా అవసరాలు తీరడం లేదు. రూ.వేల కోట్ల రుణాలు సమీకరిస్తున్నా రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విదేశీ సాయంతో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల పనులకు పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి.

ఇదీ చూడండి:Lands auction in telangana: సర్కార్‌ స్థలాలకు మళ్లీ వేలం

ABOUT THE AUTHOR

...view details