Rushikonda excavations: ఏపీ రుషికొండ తవ్వకాల అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గతంలో రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వేరే ఎక్కడా ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వట్లేదని తెలిపింది. కొత్తగా తవ్విన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తేల్చి చెప్పింది. ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఎంత ముఖ్యమో.. పర్యావరణమూ అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలని సూచింది. రుషికొండలో కాలుష్య రహిత వాతావరణం అందించే బాధ్యత అందరిపై ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేని చెప్పింది. హైకోర్టు ఎలాంటి నిబంధనలు విధించినా వాటిని పాటించాలని తెలిపింది. ఎలాంటి క్లెయిమ్ చేయమని ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొంది.
ఏపీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు నమోదు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అవసరం అనుకుంటే హైకోర్టు మరో కమిటీ నియమించుకోవచ్చని వ్యాఖ్యానించింది. ఎన్జీటీ భావించిన విధంగా హైకోర్టు మరో నిపుణుల కమిటీ నియమించుకోవచ్చని చెప్పింది. వాదనలు వినిపించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి రుషికొండలో 62 ఎకరాల్లో 9.2 ఎకరాల్లోనే నిర్మాణం చేపట్టామని అన్నారు. గతంలో ఉన్న రిసార్టు ప్రాంతంతో పాటు మరికొంత విస్తరిస్తున్నామి వాదించారు. 190 వృక్షాలే తీసేశారని అభిషేక్ సింఘ్వి చెప్పారు.
రుషికొండ విస్తరణ వ్యవహారంపై అభిషేక్ సింఘ్వీతో ధర్మాసనం విభేదించింది. గతంలో రిసార్టు ఎంతవరకు ఉందో అంతవరకే నిర్మాణాలు జరగాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదిగా ఉన్న రఘురామ హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో చెప్పిన విషయాలన్నీ హైకోర్టుకు కూడా చెప్పాలని తెలిపింది. హైకోర్టు వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. అవకాశం ఉన్నంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.