చౌక ధరలో ఏపీ ఫైబర్‌నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 250కే 10 ఎంబీపీఎస్ నెట్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టీవీ ఛానళ్లు, అపరిమిత నెట్, టెలిఫోన్ సేవలను కలిపి నెలకు రూ.599కే అందించాలని భావిస్తోంది.
రూ.250కే 10 ఎంబీపీఎస్ నెట్ - తక్కువ ధరలో ఏపీ ఫైబర్‌నెట్
వినియోగదారులు కోరితే ఇళ్లకు చౌక ధరకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే ప్రతిపాదనను ఏపీ ఫైబర్‌నెట్ చేస్తోంది. ఇన్నాళ్లూ కేబుల్, టెలిఫోన్, ఇంటర్నెట్ కలిపే ఇచ్చేవారు తప్ప విడిగా ఇంటర్నెట్ ఒక్కటే ఇచ్చే వెసులుబాటు లేదు. మార్కెట్ పోటీని, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తక్కువ ధరకు అపరిమిత ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని యోచిస్తోంది.
తక్కువ ధరలకే : గృహ వినియోగదారులకు చౌక ధరకే అపరిమిత ఇంటర్నెట్‌ను సంస్థ అందించనుంది. 10 ఎంబీపీఎస్‌కు నెలకు రూ.250, 20 ఎంబీపీఎస్‌కు రూ.350, 30 ఎంబీపీఎస్‌కు రూ.450 వంతున వసూలు చేయాలని భావిస్తోంది. కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ కనెక్షన్లకు సంసిద్ధత వ్యక్తం చేయనిచోట కొత్త ఏజెన్సీలకు అవకాశం ఇవ్వనుంది. మౌలిక సదుపాయాలను నిర్వాహకులే ఏర్పాటు చేసుకోవాలి. వినియోగదారుల నుంచి వసూలుచేసే మొత్తం నుంచే కేబుల్ ఆపరేటర్లకు సర్వీసు ఛార్జీలను ఫైబర్‌నెట్ చెల్లిస్తుంది. కేబుల్ ప్రసారాల కోసం బాక్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని టీవీ ఛానళ్లు, అపరిమిత నెట్, టెలిఫోన్ సేవలను కలిపి నెలకు రూ.599కే అందించాలని భావిస్తోంది.
- ఒకే సంస్థ వినియోగించే 2 ఎంబీపీఎస్‌కు ప్రస్తుతం ఏడాదికి వసూలు చేసే రూ.65వేల టారిఫ్‌ను రూ.48వేలకు తగ్గించింది. 20 ఎంబీపీఎస్‌కు టారిఫ్‌ను రూ.3.75 లక్షల నుంచి రూ.2.32 లక్షలకు తగ్గించింది.
- పెద్ద కంపెనీలకు 100 ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్‌కు వసూలు చేస్తున్న టారిఫ్‌ను రూ.5.75 లక్షల నుంచి 4.40 లక్షలకు తగ్గించింది. ప్రైవేటు సంస్థల కంటే తక్కువ టారిఫ్‌తో అపరిమిత నెట్ సేవలను అందిస్తామని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి ‘చెప్పారు.
ఇదీ చూడండి:కరోనానూ వదలని కేటుగాళ్లు.. ఆగని సైబర్ మోసాలు