ఏపీలో మతసామరస్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆలయాలపై దాడుల ఘటనల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే దురుద్దేశం కనిపిస్తోందని అన్నారు. ప్రతి ఘటన వెనక పార్టీల దుష్ప్రచారం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని వెల్లడించారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు.
"9 కేసుల్లో రాజకీయ పార్టీలకు చెందిన వారి ప్రత్యక్ష ప్రమేయం గుర్తించాం. ఇప్పటివరకూ 15మందిని అరెస్టు చేశాం. ఇదంతా ఓ గేమ్‌ప్లాన్‌లో భాగమని స్పష్టమవుతోంది. ఆయా చర్యలకు పాల్పడటం, దుష్ప్రచారం చేసే వైఖరిని పక్కన పెట్టాల్సిందిగా వారిని కోరుతున్నాం. అలాంటి శక్తులు, వ్యక్తులతో పాటు సైబర్ స్పేస్‌ను దుర్వినియోగం చేసే వారిపైనా మేం కఠిన చర్యలు తీసుకుంటాం. మీడియా ప్రతినిధులు అసత్య ప్రచారంలో కొట్టుకుపోయేలా వ్యవహరిస్తున్నారు"