వరద ప్రాంతాల (AP Floods ) ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానక్కర్లేదన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM JAGAN on AP Floods). వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని కోరారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సాయం అందేలా చూడాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీల పూడికతీత పనులు చేపట్టాలన్న ముఖ్యమంత్రి.. రేషన్ సరకుల పంపిణీ, నష్టంపై పక్కాగా అంచనా వేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. పంట దెబ్బతిన్న రైతులు తిరిగి సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా ఉండాలన్నారు.
వివిధ ఘటనల్లో 28 మంది మృతి
వాయుగుండం దెబ్బకు కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలతో పలు ప్రాంతాలవారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోని వస్తువులు, సామగ్రి, నగదు, నగలు, పత్రాలన్నీ వరదనీటిలో కలిసిపోయాయి. పంట పొలాలు మునిగాయి. గ్రామాల్లో అంధకారం అలుముకుంది. రహదారులు మరింత ఛిద్రమయ్యాయి. అనంతపురం జిల్లా కదిరిలో భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులు. వాయుగుండం వల్ల మొత్తంగా వర్షాల( AP rains) వల్ల వివిధ ఘటనల్లో 28 మంది మృత్యువాత పడ్డారు. 17 మంది గల్లంతయ్యారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్దకు 2 మృతదేహాలు కొట్టుకువచ్చినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కడప జిల్లా మాండవ్య నది దాటుతుండగా...అక్కాతమ్ముళ్లు నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిద్దరి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:ఏపీలో ఆ జిల్లాలపై వాయు'గండం'... 28 మంది మృత్యువాత