అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొమ్మిది నెలల తర్వాత సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరయ్యారు. ఇవాళ కచ్చితంగా హాజరుకావాలని గత వాయిదాలో కోర్టు ఆదేశించిన నేపథ్యంలో... జగన్, విజయ్ సాయిరెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐ, ఈడీ కోర్టుకు జగన్ హాజరు కావడం ఇదే మొదటిసారి. ఏపీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి కోర్టుకు హాజరై.. తిరిగి ప్రత్యేక విమానంలో వెళ్లారు.
తెలంగాణ పోలీసుల భారీ భద్రత
హైదరాబాద్ నాంపల్లిలో సీబీఐ, ఈడీ కోర్టు ఉన్న గగన్ విహార్ వద్ద తెలంగాణ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జగన్, విజయ్ సాయిరెడ్డితో పాటు పారిశ్రామికవేత్తలు ఎన్.శ్రీనివాసన్, అయోధ్య రామిరెడ్డి, ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, మన్మోహన్ సింగ్, మాజీ ఐఏఎస్ అధికారి శామ్యూల్, తదితరులు కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
మినహాయింపు ఇవ్వండి
ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోర్టును సీఎం జగన్ కోరారు. ముఖ్యమంత్రిగా ప్రజా విధుల్లో ఉన్నందున హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరారు. విచారణ కోసం ఏపీ నుంచి ప్రత్యేకంగా రావడం వల్ల భారీగా ప్రజా ధనం ఖర్చవుతోందని పేర్కొన్నారు. జగన్ అభ్యర్థనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులకు మినహాయింపులు ఇవ్వొద్దని ఈడీ తరఫు న్యాయవాది సుబ్బారావు వాదించారు. సెషన్స్ కేసుల్లో విచారణకు నిందితులు కచ్చితంగా హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ఈనెల 24కి వాయిదా వేసింది.