తెలంగాణ

telangana

ETV Bharat / city

రవాణాశాఖలో ఆన్​లైన్​లోకి మరో 17 సేవలు - how to get llr in telangana

రవాణా శాఖలో 'ఎనీవేర్ ఎనీ టైమ్‌' లో భాగంగా మరో 17 సేవలు అందుబాటులోకి వచ్చాయి. దళారుల ప్రమేయం లేకుండా..... రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లకుండా సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. కంప్యూటర్లు, ఫోన్ల ద్వారా ఈ సేవలు పొందే వెసులుబాటును కల్పించారు.

telangana transport department
రవాణాశాఖలో ఆన్​లైన్​లోకి మరో 17 సేవలు

By

Published : Mar 13, 2021, 5:54 PM IST

రవాణా శాఖలో గతంలో ఏ పని కావాలన్నా.. ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ అవస్థల నుంచి విముక్తి కలిగించేందుకు.. రవాణా శాఖ విడతల వారీగా వివిధ సేవలను ఆన్‌లైన్‌లో పరిధిలోకి తెస్తోంది. తాజాగా మరో 17 సేవలను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసింది.

ఏయే సేవలు ఆన్​లైన్​ ఉన్నాయంటే..

రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో చిరునామా మార్పు, క్లియరెన్స్ సర్టిఫికెట్, న్యూ పర్మిట్, డూప్లికేట్ పర్మిట్, పర్మిట్ రెన్యూవల్, తాత్కాలిక/ప్రత్యేక పర్మిట్‌లను ఆన్‌లైన్‌లోనే పొందే వెసులుబాటును కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్పు, హజార్ దస్ లైసెన్స్ ఎండార్స్‌మెంట్, అదనపు క్లాస్ వాహనానికి లెర్నింగ్‌ లైసెన్స్, ఎల్​ఎల్​ఆర్​ గడువు తీరిన దానికి డ్రైవింగ్ లైసెన్స్, డూప్లికేట్ లెర్నింగ్‌ లైసెన్స్, డూప్లికేట్​ లైసెన్స్‌లను కార్యాలయానికి వెళ్లకుండానే పొందవచ్చని అధికారులు తెలిపారు. వీటితోపాటు బ్యాడ్జీ, స్మార్ట్‌కార్డ్, మునుపటి డ్రైవింగ్ లైసెన్స్‌ సరెండర్ చేయడం, లైసెన్స్ షీట్ పూర్వపరాలు, గడువు తీరిన ఎల్​ఎల్​ఆర్​ లైసెన్స్ స్థానంలో కొత్తది పొందే సౌలభ్యం వంటి సేవలను ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తెచ్చారు.

ఆన్​లైన్​లో పెరుగుతున్న పన్ను చెల్లింపులు..

మరోవైపు ఆన్‌లైన్‌లో వాహనాల పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 81 వేల 963 వాహనాలకు సంబంధించి రూ.222.36 కోట్ల పన్ను వసూలైంది. ఇందులో 56 వేల 181 ద్విచక్ర వాహనాలకు రూ.42.31 కోట్లు, 13 వేల 571 నాలుగు చక్రాల వాహనాలకు రూ.174.81 కోట్లు, 12 వేల 211 ఇతర వాహనాలకు రూ.5.24 కోట్ల పన్నులు వసూలు చేసినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో సుమారు 30 నుంచి 40 శాతం వరకు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకున్నట్లు రవాణశాఖ ప్రకటించింది.

ఆన్​లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పూర్తిస్థాయిలో దళారుల బెడద మాత్రం తీరడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. దళారీ వ్యవస్థపై రవాణాశాఖ నిఘా పెడితేనే.. రూపుమాపే వీలుందని చెబుతున్నారు.

ఇవీచూడండి:టీఎస్​పీఎస్సీ పేరిట నకిలీ మెయిల్​.. సైబర్​ క్రైంకు ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details