తెలంగాణ

telangana

ETV Bharat / city

25 మందితో ఏపీ కొత్త కేబినెట్.. జాబితాలో ఉన్నది వీరే!

andhra-pradesh-new-cabinet-list
andhra-pradesh-new-cabinet-list

By

Published : Apr 10, 2022, 4:47 PM IST

Updated : Apr 10, 2022, 6:59 PM IST

16:46 April 10

25 మందితో ఏపీ కొత్త కేబినెట్.. జాబితాలో ఉన్నది వీరే...

AP New cabinet: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖరారైంది. ఎన్నో కసరత్తులు.. మరెన్నో సమీకరణాలు.. ఇంకెన్నో కూడికలు, ఎన్నెన్నో తీసివేతల తర్వాత ఏపీ నూతన మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయ్యింది. మొత్తం 25 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. నూతన మంత్రివర్గం రేపు(సోమవారం) ఉదయం కొలువుదీరనుంది. గడిచిన మూడురోజులుగా మంత్రివర్గం కూర్పుపై ఎన్నో మంతనాలు సాగించిన సీఎం.. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రానికి తుదిజాబితాను ఖరారు చేశారు. రేపు ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న పార్కింగ్‌ స్థలంలో.. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా.. మంత్రుల పేర్లను ఖరారు చేసి.. ఈ జాబితాను రాజ్​భవన్​కు పంపించారు. గవర్నర్ ఆమోదించారు.

మంత్రి వర్గం జాబితా...

పేరు జిల్లా సామాజికవర్గం
ధర్మన ప్రసాద రావు శ్రీకాకుళం వెలమ
సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం మత్స్యకార
బొత్స సత్యనారాయణ విజయనగరం తూర్పు కాపు
రాజన్న దొర పార్వతీపురం ఎస్టీ
గుడివాడ అమర్‌నాధ్‌ అనకాపల్లి కాపు
ముత్యాలనాయుడు అనకాపల్లి కొప్పుల వెలమ
దాడిశెట్టి రాజా కాకినాడ కాపు
పినిపె విశ్వరూప్‌ కోనసీమ ఎస్టీ
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కోనసీమ బీసి - శెట్టి బలిజ
తానేటి వనిత తూర్పుగోదావరి మాదిగ - ఎస్సీ
కారుమూరి నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి యాదవ - బీసీ
కొట్టు సత్యనారాయణ పశ్చిమ గోదావరి కాపు
జోగి రమేష్ కృష్ణా గౌడ - బీసీ
అంబటి రాంబాబు పల్నాడు కాపు
మేరుగ నాగార్జున బాపట్ల ఎస్సీ
విడదల రజని గుంటూరు బీసీ
కాకాణి గోవర్దన్​ రెడ్డి నెల్లూరు ఓసీ - రెడ్డి
అంజద్‌ బాషా కడప మైనార్టీ
బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి నంద్యాల ఓసీ - రెడ్డి
గుమ్మనూరు జయరాం కర్నూలు ఓసీ - బోయ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు ఓసీ - రెడ్డి
నారాయణ స్వామి చిత్తూరు ఎస్సీ
ఆర్‌ కే రోజా చిత్తూరు ఓసీ - రెడ్డి
ఉషా శ్రీ చరణ్‌ అనంతపురం కురుమ- బీసీ
ఆదిమూలపు సురేశ్‌ ప్రకాశం ఎస్సీ

సుదీర్ఘ కసరత్తు: మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపై మూడు, నాలుగు రోజుల నుంచి సీఎం కసరత్తు చేస్తున్నారు. శుక్ర, శనివారాలు రెండు రోజులూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించుకుని చర్చించారు. ఈరోజు (ఆదివారం) ఉదయం నుంచి జాబితాపై కసరత్తు జరుగుతోంది. తుది జాబితాను గవర్నర్‌కు పంపేవరకూ అందులోని పేర్లు బయటకు రాకుండా గోప్యత పాటించారు.

సామాజిక సమీకరణలే ప్రధానం : కొత్త మంత్రివర్గం కూర్పులో మొదటి నుంచీ సామాజిక వర్గాల సమీకరణలే ప్రధానంగా నిలుస్తాయనే చర్చ సాగింది. ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక సమతుల్యతను పాటిస్తున్నట్టు చెప్పారు. అనుకున్నట్టుగానే.. కుల సమీకరణాలతోనే మంత్రివర్గం కూర్పు జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సజ్జలే కీలకం : మంత్రివర్గ కూర్పులో సజ్జల కీలకంగా వ్యవహరించారనే చర్చ సాగుతోంది. గత మూడు రోజులుగా ఈ విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం పలు దఫాలుగా చర్చించారనే వార్తలు వచ్చాయి. ఈరోజు (ఆదివారం) కూడా సజ్జలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సీఎం జగన్​తో భేటీ అనంతరం సజ్జలే మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలతోపాటు.. కొత్త మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంపైనా సీఎం సజ్జలతో కలికే ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయినవారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. మొత్తంగా కేబినెట్ కూర్పులో సజ్జల పాత్ర కీలకంగా మారిందని సమాచారం.

రేపు తేనేటి విందు : సోమవారం కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్‌ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని 11:31 గంటల నుంచి నిర్వహించనున్నారు. అది ముగిశాక.. ముఖ్యమంత్రి గవర్నర్‌తో కలిసి కొత్త మంత్రులతో తేనేటి విందులో పాల్గొనడంతోపాటు గ్రూప్‌ ఫొటో తీయించుకుంటారు.

పాత కొత్తల కలయిక: ‘పాత, కొత్త కలయికలో మంత్రివర్గం ఏర్పాటైంది. ముందునుంచీ.. ఐదారుగురు పాతవారిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవచ్చనే చర్చ సాగింది. అయితే.. ఏకంగా పదకొండు మందికి స్థానం కల్పించారు. మిగిలిన స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అత్యధికంగా చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరికి చొప్పున అవకాశం దక్కింది. మంత్రివర్గంలో మొత్తం 8 జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. గుంటూరు, ఎన్టీఆర్‌, అన్నమయ్య, విశాఖ, అల్లూరి, తిరుపతి, రాజంపేట, సత్యసాయి జిల్లాలకు మంత్రిపదవి దక్కలేదు.

ఇదీ చూడండి:

Last Updated : Apr 10, 2022, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details