తెలంగాణ

telangana

ETV Bharat / city

Anandaiah: 'కంటి చుక్కల మందుపై తగిన ఉత్తర్వులిస్తాం' - ఆనందయ్య మందుపై హైకోర్టు

కరోనా బాధితులకు ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామని ఏపీ హైకోర్టు (High Court) పేర్కొంది. అనంతరం విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేశ్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టంచేసింది.

Anandaiah
ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీ విషయంలో ఏపీ హైకోర్టులో విచారణ

By

Published : Jun 4, 2021, 8:57 AM IST

కరోనా బారినపడి, క్లిష్టపరిస్థితుల్లో ఉన్నవారు చివరి అవకాశంగా వారంతటవారు వచ్చి ఆనందయ్య ఇచ్చే కంటి చుక్కల మందు తీసుకుంటామంటే అనుమతించే విషయాన్ని పరిశీలించాలని ఏపీ హైకోర్టు(High Court) ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంటి చుక్కల మందు పంపిణీకి నిపుణుల కమిటీ సిఫారసు చేయలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చెప్పారు. దీంతో ఈ మందు పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు(High Court) న్యాయమూర్తులు జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేసింది. కృష్ణపట్నం గ్రామంలో కొవిడ్‌కు తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధాల పంపిణీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని ఆనందయ్య హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో మరో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు ఉన్నాయి.

మరోసారి పరీక్షలు చేయాలి: ఎస్‌జీపీ


గురువారం జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ఇటీవల అనుమతిచ్చిన ఔషధాలతో పాటు ‘కె’ మందు పంపిణీకి అభ్యంతరం లేదన్నారు. కంటి చుక్కల పంపిణీకి నిపుణుల కమిటీ సిఫారసు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. స్టెరిలిటీ పరీక్షలో కంటి చుక్కల మందు అర్హత సాధించలేదన్నారు. మరోసారి పరీక్షలు అవసరమని, వాటి నివేదికలు రావడానికి 2, 3 వారాల సమయం పడుతుందని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. క్లిష్టపరిస్థితుల్లో ఉన్నవారు తమంతట తాము వచ్చి కంటి మందు తీసుకునేందుకు అనుమతించే విషయాన్ని పరిశీలించాలని ప్రతిపాదించింది.

కంటి చుక్కలే కీలకం


ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఆక్సిజన్‌ స్థాయి తగ్గిన వాళ్లకు కంటి చుక్కల మందు కీలకమన్నారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్నవారికి కంటి చుక్కలు వేస్తే ఆక్సిజన్‌ స్థాయి పెరుగుతుందన్నారు. కాబట్టి దీని పంపిణీకి అనుమతివ్వాలని కోరారు. స్టెరిలిటీ పరీక్ష అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్‌జీ హరినాథ్‌ వాదిస్తూ.. ఔషధం భద్రత, సమర్థత రెండూ ముఖ్యమేనన్నారు. అనుకోనిది ఏమైనా జరిగితే న్యాయస్థానంపై అపవాదు మోపే పరిస్థితి రాకూడదని చెప్పారు.

ఆనందయ్య మందు పంపిణీకి వెబ్‌సైట్లు లేవు
ఆనందయ్య ఇస్తున్న కరోనా మందు పంపిణీకి ప్రస్తుతం వెబ్‌సైట్లు లేవని ఆయన కుమారుడు శశిధర్‌ గురువారం తెలిపారు. వెబ్‌సైట్‌ సిద్ధమైతే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:Land Greviences: పార్ట్-బీ నుంచి పార్ట్‌-ఏలోకి మారేనా.. రైతుబంధు సాయం అందేనా..!

ABOUT THE AUTHOR

...view details