Prayer for Saitej: సాయితేజ్ త్వరగా కోలుకోవాలని 'అమ్మ ప్రేమ' ప్రార్థన విజయవాడలో వృద్ధులకు చేయూతనిచ్చేందుకు పురుడు పోసుకుంది అమ్మప్రేమ ఆదరణ సేవా సంస్థ. కొంతకాలం బాగానే నడిచినా.. ఆ పెద్దాయన అకాల మరణంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ బాధ్యతలను ఆయన కొడుకు వారసత్వంగా స్వీకరించాడు. తండ్రి ఆశయ సాధనకు పునరంకితం అయ్యాడు. భవిష్యత్తులో ఆ వృద్ధాశ్రమం వెనుదిరికి చూడకూడదని, నిలువ నీడకోసం పరితపించకూడదని అతను భావించాడు. ఓ రోజు అక్కడి దుస్థితిని, తాను చేయాలనుకుంటున్న మంచి కార్యాన్ని సాయిధరమ్ తేజ్‌కు వివరించాలని ఆలోచించాడు. అంతపెద్ద హీరోని చేరుకోవడం సాధ్యమేనా? అనే సందేహం అతనికి కలిగింది.
ఒక్క ట్వీట్.. ఒకే ఒక్క ట్వీట్...
హీరో సాయిధరమ్ తేజ్‌కు ఆ నిర్వాహకుడు ఓ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత అతను ఊహించనిది జరిగింది. సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ వృద్ధాశ్రమం పరిస్థితి ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ కావాల్సిన వసతులేంటి? ఇవన్నీ.. వాకబు చేసి చెప్పమని తమ తేజ్ నుంచి ఫోన్ వచ్చిందని ఫ్యాన్స్ చెప్పారు. అంతటితో ఆగకుండా వీటన్నింటినీ సమకూర్చడంలో వారివంతు బాధ్యత నెరవేర్చారు. తేజ్‌తోపాటు మరికొందరి సాయంతో ఆ వృద్ధాశ్రమం సరికొత్తగా రూపుదిద్దుకుంది. ఆ ఆశ్రమాన్ని స్వయంగా సాయిధరమ్ తేజ్ ప్రారంభించాడు.
ఆ ప్రేమ అనిర్వచనీయం...
సాయిధరమ్ తేజ్ కొద్దిసేపే అక్కడ ఉన్నారు. కానీ.. అక్కడి వారెవరూ అతడిని మరచిపోలేక పోయారు. కాసేపట్లో అంత ప్రేమను పంచేశాడు. పక్కనే కూర్చుని అమ్మా.. అంటూ పిలిచిన ఆ ఆప్యాయత ఇంకా వారికి వినిపిస్తూనే ఉంది ఆ వృద్ధులు గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఆయుష్షు కూడా పోసుకుని ఆ దేవుడు తేజ్‌కు నూరెళ్ల ఆయుష్షు ప్రసాదించాలని వేడుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాయిధరమ్ తేజ్ తన ద్విచక్రవాహనంపై శుక్రవారం రాత్రి 7.40 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి మాదాపూర్ వేలాడే వంతెన మీదుగా రాయదుర్గం ఐకియా వైపునకు ట్రయంఫ్ స్పోర్ట్స్ బైక్‌పై బయలుదేరారు. రాత్రి 8 గంటలకు నోవార్టిస్‌కు కొద్దిదూరంలో ఆయన బైక్‌పై నుంచి కింద పడ్డారు. అక్కడ రోడ్డుపై ఇసుక, మట్టి ఉండటంతో బైకు అదుపు తప్పి 50 మీటర్ల దూరం జారుతూ వెళ్లింది. ఘటనలో ఆయన కుడివైపు ఛాతీ, పొట్ట, కళ్ల చెంత, కాలి వేళ్లకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడికి వచ్చేసరికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ‘అప్పటికే గ్లాస్గో కోమా స్కోర్ (జీసీఎస్) 7 వరకు ఉంది. మెదడు, ఇతర అవయవాల కదలికను బట్టి ప్రమాదానికి గురైన వ్యక్తులకు జీసీఎస్‌ను లెక్కకడతాం. ఆ స్కోరు సాధారణంగా 15 వరకు ఉండాలి. సాయిధరమ్‌కు జీసీఎస్ తక్కువగా ఉండటంతో కృత్రిమ శ్వాస అందించి ఫ్లూయిడ్స్ పెట్టాం’ అని మెడికవర్ వైద్యుడు డాక్టర్ సతీష్ తెలిపారు. ప్రమాదం జరిగిన 30-40 నిమిషాల్లోనే ఆయనను ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. అక్కడ రెండు గంటల పాటు చికిత్స అందించాక జూబ్లీహిల్స్ అపోలోకి తరలించారు.
ఇదీ చదవండి: Sai Dharam tej Bike: సాయిధరమ్ తేజ్ బైక్ అంత ప్రత్యేకమైందా..? ధరెంతో తెలుసా?