అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు చేదువార్త. త్వరలో సబ్‌స్క్రిప్షన్ ధరలు పెరగనున్నాయి. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్లాన్ ధరలను కూడా అమెజాన్ సవరించనుంది. త్వరలోనే ఈ పెంపు ఉంటుందని అమెజాన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ప్రైమ్ వీడియోలు, ప్రైమ్ మ్యూజిక్‌తోపాటు, ఉచిత హోమ్ డెలివరీ వంటి తదితర ప్రయోజనాలు అందుతున్నాయి. ఇందుకు ఏడాదికి రూ.999 అమెజాన్ వసూలు చేస్తోంది. కొవిడ్ నేపథ్యంలో ఓటీటీ వేదికలకు ఈ మధ్య డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి తోడు ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లవైపు కూడా పెద్దఎత్తున వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ సమయంలో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచనున్నట్లు అమెజాన్ పేర్కొంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ వార్షిక చందాను రూ.999 నుంచి రూ.1499కి పెంచనున్నట్లు అమెజాన్ తెలిపింది. త్రైమాసిక చందా ప్రస్తుతం రూ.329 ఉండగా.. దాన్ని రూ.459కి పెంచనున్నట్లు పేర్కొంది. నెలవారీ ప్లాన్‌కు ప్రస్తుతం రూ.129 చెల్లిస్తుండగా ఇకపై రూ.179 చెల్లించాల్సి ఉంటుందని అమెజాన్ తెలిపింది.