Amaravati Farmers Public Meeting: అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరిట.. రేపు రాజధాని రైతులు తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు.. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి, రేపటికి రెండేళ్లవుతున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తుళ్లూరు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర పూర్తి చేసిన రైతులు.. రేపటి సభ కోసం ఎదురు చూస్తున్నారు. సమయం ఒక్కరోజు మాత్రమే ఉండటంతో ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. ఈ ఉదయం ఐకాస నేతలు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఐకాస నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, రాయపాటి శైలజ, తెదేపా నేత పులివర్తి నాని పాల్గొన్నారు. రేపటి సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. సీపీఐ, జనసేన నాయకులు కూడా పాల్గొనే అవకాశముంది.
సభను విజయవంతం చేయాలి - భాజపా
BJP on Amaravati Farmers Public Meeting in Tirupati: తిరుపతి వేదికా తలపెట్టిన అమరావతి ఐకాస బహిరంగ సభను విజయవంతం చేయాలని భాజపా.. తమ పార్టీ శ్రేణులకు ఆదేశాలను జారీ చేసింది. పార్టీ తరపున కన్నా లక్ష్మీనారాయణతో పాటు రావెల కిషోర్‌బాబు హాజరుకానున్నట్లు వెల్లడించింది.
అలర్లు సృష్టించాలని చూస్తున్నారు: అచ్చెన్నాయుడు
తిరుపతిలో అమరావతి పరిరక్షణ సభను విజయవంతం చేయాలి. సభ విజయవంతం చేయడంలో తెదేపా శ్రేణులు భాగం కావాలి. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. కొందరు వైకాపా సానుభూతిపరులు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. అభివృద్ధి చేతగాక ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారు- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
సీపీఐ నుంచి జాతీయ నాయకులు..
అమరావతి ఐకాస సభకు సీపీఐ పార్టీ నుంచి జాతీయ నాయకులు హాజరుకానున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతోపాటు అతుల్ కుమార్ అంజన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.