ప్రభుత్వ 'అఫిడవిట్'పై రాజధాని రైతుల ఆగ్రహం AP Farmers On Affidavit: అమరావతి నిర్మాణ విషయంలో ఏపీ ప్రభుత్వ అఫిడవిట్‌పై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పిటిషన్ అవాస్తవాలతో కూడుకున్నదని ఆక్షేపిస్తున్నారు. అభివృద్ధి చేయడం చేతకాక కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు.
రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఏపీ ప్రభుత్వ అఫిడవిట్‌పై అమరావతి రైతుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ధర్మాసనం తీర్పును అమలు చేయకుండా.. తప్పుడు లెక్కలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టని సీఆర్డీఏ చట్టంలోనే స్పష్టంగా ఉన్నా.. ప్రభుత్వం విస్మరించిందని అంటున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయకపోవటం.. సీఎం జగన్ మొండి వైఖరికి నిదర్శనమని అన్నదాతలు అంటున్నారు.
ప్లాట్ల రిజిస్ట్రేషన్ అంటూ హడావుడి చేసిన సీఆర్డీఏ అధికారులు.. కనీసం ప్లాట్లు ఎక్కడున్నాయో చెప్పలేదని..రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రైతులకు ఆసక్తి లేదని తమపైనే నెపం మోపారని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల నిధులు లేవని..ప్లాట్ల అభివృద్ధికి 60నెలల సమయం కావాలని చెప్పటం సరికాదంటున్నారు. కంపచెట్లు తొలగించి, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించేందుకు ఐదేళ్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ అఫిడవిట్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతులు చెబుతున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. దీన్ని ముందే గ్రహించిన రైతులు ఇప్పటికే సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ విచారణకు స్వీకరిస్తే తమ వాదన కూడా వినాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Amaravati: కాలయాపన చేసేందుకే ప్రభుత్వం సాకులు