Amaravati farmers donate: వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం అందించారు. మహాపాదయాత్రకు వచ్చిన చందాల నుంచి 15 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు 5 లక్షల చొప్పున నగదును మూడు జిల్లాల కలెక్టర్లకు విరాళంగా అందజేయాలని రైతుల నిర్ణయించారు. రైతుల బాధ రైతులకే తెలుసంటూ రాజధాని రైతులు ఈ విరాళం ప్రకటించారు.
ఏపీ సీఎం జగన్ సమీక్ష
AP CM JAGAN ON RAINS: భారీ వర్షాలపై చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతిలో వరదనీటి నిల్వకు కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలన్న జగన్... ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని సూచించారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులకు గండ్లు పడినచోట తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం ఆయా జిల్లాలకు అదనంగా నిధులు మంజూరు చేయాలని శుక్రవారం జరిగిన కాన్ఫరెన్స్లో ఆ రాష్ట్ర సీఎం స్పష్టం చేశారు.
వానలతో అతలాకుతలం
Andhra pradesh flood news: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో వర్షం ఆగి రెండు రోజులు గడిచినా చాలా గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. రహదారులు కోతకు గురై చాలాగ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జిల్లాలో సుమారు 30 వేలమందిపై వరద ప్రభావం చూపింది. రాయలచెరువుకు చిన్న గండి పడడంతో రామచంద్రాపురం, తిరుపతి గ్రామీణ మండలాల పరిధిలోని 16 గ్రామాల్లో14 వేల 960 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. వరద బాధితులు కట్టుబట్టలతో వచ్చినాపశువుల్ని వదిలేసి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలచెరువుకు గండి పడిన ప్రాంతాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించి తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండి పూడ్చేందుకు ఐఐటీ నిపుణుల సలహా తీసుకుంటున్నామని, వీలైనంత త్వరగా పూడ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.