ఈనెల 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. దేశంలోని ఎంపీలందరికీ అమరావతి ఐకాస లేఖలు రాసింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేందుకు తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని.. అమరావతి ఐకాస ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రి, కన్వీనర్ శివారెడ్డి లేఖల్లో కోరారు. ఎంపీ రఘురామ కృష్ణరాజుకు కూడా జేఏసీ లేఖ రాసింది. దీనిపై స్పందించిన రఘురామ అమరావతి ప్రజలకు మద్దతిస్తానని హామీ ఇచ్చారు.
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల మంది రైతుల త్యాగాలను.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించిన రూ.10 వేల కోట్ల రూపాయల వ్యయం, ఇతర పెట్టుబడులను పరిరక్షించటమే తమ ప్రధాన ధ్యేయమని ఐకాస నేతలు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో పరిపాలన రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తోందని.. దీనికి వ్యతిరేకంగా ఏడాదిన్నర పైగా ఉద్యమం చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారని.. దిల్లీని మించిన ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి ఆయన మద్దతు తెలిపారని లేఖలో తెలిపారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో.. 29 గ్రామాల ప్రజలు 33 వేల ఎకరాలను రాజధానికి ఇచ్చారని.. ఈ విధానానికి ఎంతగానో ప్రశంసలు దక్కాయని గుర్తుచేశారు.
అమరావతిలో భవనాలు, ఇతర మౌలిక వసతులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిపి సుమారు రూ.40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతి.. రెండు జాతీయ రహదారులు, అతిపెద్ద రైల్వే జంక్షన్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవులకు సమీపంలోనే ఉందని వివరించారు. 2014లో పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని ఉండాలని.. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో విభజించేందుకు ప్రయత్నిస్తోందని లేఖలో ఐకాస తెలిపింది. ఇప్పటికే ఏపీ హైకోర్టు అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోందని వెల్లడించింది. మూడు రాజధానుల బిల్లును శాసన మండలి తిరస్కరించిందనే కారణంతో.. శాసనమండలినే రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిందని ఎంపీల దృష్టికి తీసుకొచ్చింది.