కృష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ వరద భారీగా వస్తోంది. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ దాదాపుగా నిండాయి. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. వస్తున్న దానికంటె ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.93 టీఎంసీల నీరు ఉంది.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ఫుల్:
శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీలకు గాను 212 టీఎంసీలు ఉండగా... ఎగువ నుంచి 3 లక్షల 50వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు దాదాపుగా అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్లో 312 టీఎంసీలకు గాను 309 టీఎంసీల నీరు ఉండగా... 4 లక్షల 30 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.