తెలంగాణ

telangana

ETV Bharat / city

'దేశం అంతటా పంటల క్రయవిక్రయాలకు ఒకే చట్టం అవసరంలేదు'

కేంద్రం ఇప్పడు తీసుకువస్తున్న కాంట్రాక్టు వ్యవసాయ చట్టం, మరో రెండు చట్టాల వల్ల చిన్న రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బడా కంపెనీలు పార్టీలకు నిధులిస్తాయి. ప్రభుత్వాల్లో వారు చెప్పినట్లు జరుగుతుంటుంది. అందువల్ల చిన్న రైతులు పంటల ఉత్పత్తిదార్ల సంఘాలుగా ఏర్పడి కలిసికట్టుగా కంపెనీలతో వ్యవహరించాలి. సుమారు వెయ్యిమంది కూడా ఇలా సంఘంగా ఏర్పడవచ్చు. అలా చేస్తే బేరమాడే శక్తి పెరిగి అధిక ధర పొందడానికి వీలుంటుందంటున్న ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ఎస్‌.మహేంద్రదేవ్​తో ముఖాముఖి.

agriculture economist professor mahendradev interview on new central bills
agriculture economist professor mahendradev interview on new central bills

By

Published : Sep 24, 2020, 7:09 AM IST

విశాలమైన భారతదేశం అంతటా పంటల క్రయవిక్రయాలకు ఒకే చట్టం అక్కర్లేదని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ఎస్‌.మహేంద్రదేవ్‌ స్పష్టం చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో భిన్నమైన పంటలు సాగవుతాయని, వినియోగంలోనూ తేడాలున్నాయని.. పరిస్థితులూ వేరని చెప్పారు. ఆయన గతంలో కేంద్రంలో వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ ఛైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం ముంబయిలోని ‘ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌’ సంచాలకుడిగా, ఉపకులపతిగా పని చేస్తున్నారు. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ముఖాముఖి ఇచ్చారు. దేశంలో 86% సన్నకారు రైతులే ఉన్నారని, వారిని దృష్టిలో పెట్టుకునే కొత్తగా చట్టాలు చేయాలని సూచించారు. మరిన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని తెలిపారు.

  • తాము తెచ్చిన బిల్లుల వల్ల రైతులు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని, దీనివల్ల మెరుగైన ధర లభిస్తుందని కేంద్రం చెబుతోంది. మార్కెట్‌ యార్డులకు పోటీగా ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫారాల ఏర్పాటుకూ అనుమతి ఇస్తోంది. ఈ మార్పుల ప్రభావం రైతులపై ఎలా ఉంటుందని భావిస్తున్నారు?
  • వ్యవసాయ రంగంలో సంస్కరణల ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫారాలు సన్నకారు, చిన్నకారు రైతులకు ఉపయోగపడవు. భవిష్యత్తులో కనీస మద్దతు ధరలు ఉండవని రైతులు భయపడుతున్నారు. యార్డుల ద్వారా వచ్చే ఆదాయం ఇక రాదనే ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాలలో ఉంది. మండీల ద్వారా పంజాబ్‌కు ఏటా రూ.4వేల కోట్ల ఆదాయం వస్తోంది. సన్నకారు, చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని మనం చట్టాలను తీసుకురావాలి.
  • కాంట్రాక్టు వ్యవసాయానికి వస్తే.. దేశంలో రిటైల్‌ రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి. బడా కంపెనీల ఆధిపత్యం పెరిగిపోతోంది. వాటితో బేరమాడి.. ప్రయోజనాలను కాపాడుకోవడం చిన్న రైతులకు సాధ్యమేనా?
  • ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్న కాంట్రాక్టు వ్యవసాయాన్ని విస్తరించాలని ప్రభుత్వం చూస్తోంది. దీనివల్ల బడా కంపెనీల ప్రాబల్యం పెరగవచ్చు. కంపెనీకి, రైతుకు వివాదం వస్తే పరిష్కరించే బాధ్యతను జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. అధికారుల వద్ద తమకు న్యాయం జరగదన్న ఆందోళన రైతుల్లో ఉంది. అందువల్ల కాంట్రాక్టు వ్యవసాయంపై నియంత్రణ బలంగా ఉండాలి.
  • నిత్యావసర సరకుల చట్టంలో మార్పులవల్ల ఇక వ్యాపారులు ఎంతైనా సరకులు నిల్వ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం వినియోగదారులపై ఎలా ఉండొచ్చు?
  • తగిన నిల్వలు లేకపోతే ధరలను అదుపులో ఉంచడం కష్టమనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు తెస్తున్న మార్పులతో బడా కంపెనీలకు ఎక్కువ లాభం ఉండవచ్చు. ధరల పెరుగుదల ఫలితం రైతుకు ఎక్కువగా దక్కకపోవచ్చు. ఈ చట్టం వచ్చాక వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు పెరిగితే రైతుకు నష్టమే. ఇలాంటి చట్టాలు తెచ్చేటప్పుడు రైతులనూ సంప్రదించి వారికి మేలు జరిగేలా చూడాలి. సరకులను ఎక్కువగా నిల్వచేస్తే వినియోగదారునికీ నష్టమే. ఈ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మన దగ్గర చట్టాలు చేసేటప్పడు రైతుల కంటే వినియోగదారుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇద్దరి ప్రయోజనాలూ చూడాలి.
  • దేశవ్యాప్తంగా ఒకే నిబంధనలతో వ్యవసాయోత్పత్తుల క్రయవిక్రయాలు చేయాలనడం హేతుబద్ధమేనా?
  • నా ఉద్దేశంలో ఒకే దేశం - ఒకే మార్కెట్‌ అక్కర్లేదు. మన రాష్ట్రాలు భిన్నమైనవి. వేర్వేరు పంటలు, వినియోగ రీతులు ఉన్నాయి. అందువల్ల దేశమంతా ఒకే చట్టం అంత విజయవంతం కాకపోవచ్చు. ఉదాహరణకు పంజాబ్‌, హరియాణాలలో మండీలు (రాష్ట్ర మార్కెట్‌ యార్డులు) ఎక్కువ. ఇతర రాష్ట్రాల్లో తక్కువ. అందువల్ల ఒకే చట్టం మంచిది కాదు. రైతులకు స్వేచ్ఛ, సంస్కరణలు అనే భావనలు మంచివే. ఆచరణ లోపాలు లేకుండా చూసుకుంటే వారికి మేలు జరుగుతుంది.
  • ఉల్లిపాయల ధరలు దాదాపు స్థిరంగా ఉన్నప్పుడే కేంద్రం ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది. ఇది రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. బిహార్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల కోసమే ఈ చర్య తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
  • ఉల్లిపాయలు బాగా ఉత్పత్తయ్యే నాసిక్‌ వంటి ప్రాంతాల్లో ఇటీవల వరదల వల్ల పంట దెబ్బతింది. దీంతో ఉల్లిపాయల ధరలు పెరిగాయని ఎగుమతులు ఆపేశారు. ఉల్లి ధరలపై ప్రభుత్వాలు సున్నితంగా స్పందిస్తాయి. ఆ ధరల వల్లే గతంలో కొన్ని ప్రభుత్వాలు పడిపోయాయి. ఉల్లి ఎగుమతుల నిషేధానికి ఎన్నికలూ ఒక కారణం కావచ్చు. అందుకే వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తలందరం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు వద్దని చెబుతున్నాం. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. ఎన్నికల కోసం పంటల ఎగుమతులు ఆపేయడం మంచిది కాదు.
  • కొత్త బిల్లులతో వ్యవసాయ రంగంలోని కీలకాంశాలపై కేంద్రానిదే పెత్తనం ఉంటుంది. ఇలాంటి చర్యలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను ఇవ్వగలవా?
  • ఇన్నాళ్లూ వ్యవసాయం రాష్ట్ర అంశం. ప్రస్తుత కేంద్ర నిర్ణయాలను అమలుచేయాల్సిందీ రాష్ట్రాలే. వాటిని, రైతులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే ఆందోళనలు ఉండేవి కావు. చట్టాలతో మంచి ఫలితాలు రావాలంటే కేంద్రం వాటి అమలులో రాష్ట్రాలనూ భాగస్వాములు చేయాలి. చిన్న, మధ్యతరహా కంపెనీలు ఎక్కువగా ఉండాలి.
  • చైనాలో సాగు విస్తీర్ణం మనకంటే తక్కువైనా.. అక్కడ మనకంటే రెండురెట్ల ఉత్పత్తులు వస్తున్నాయి. మనం ఇంత వెనుకబడటానికి కారణమేంటి?
  • చైనా 1978లో తన సంస్కరణలను వ్యవసాయంతో ప్రారంభించింది. మనం 1990 తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రారంభించాం. చైనా వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఎక్కువ. సాగునీటి పారుదలను బాగా అభివృద్ధి చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, బయోటెక్నాలజీలను ఎక్కువ వాడతారు. అందుకే వాళ్లు ముందున్నారు.
  • కరోనా సమయంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థే బాగుందని.. సాగు ప్రోత్సాహకరంగా ఉండటం దేశ ఆర్థికవ్యవస్థకూ మేలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది వాస్తవమేనా?
  • ఈసారి వర్షాలు బాగుండటంతో సాగు బాగుంది. వ్యవసాయంలో వృద్ధిరేటు 3% ఉండచ్చు. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మైనస్‌ 10% ఉండవచ్చు. ప్రస్తుతం గ్రామాల్లో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ ఉంది. వీటిలో కొన్ని.. గతంలో కొనాలనుకుని కరోనా వల్ల ఆగిపోయి.. ఇప్పుడు కొంటున్నవీ కావచ్చు. ఈ డిమాండ్‌ ఎంత నిలబడుతుందో చూడాలి. దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో సగం గ్రామాల్లో ఉన్నాయి. అవి పుంజుకోవడంపై గ్రామీణ ఆదాయాలు ఆధారపడతాయి. అందువల్ల మొత్తం ఆర్థికవ్యవస్థ వృద్ధిలో వ్యవసాయరంగం కీలకపాత్ర వహించే అవకాశం లేదు.
  • రైతుల ఆదాయాన్ని 2022-23 నాటికి రెట్టింపు చేస్తామని 2016లో కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇది కష్టమనే అనిపిస్తోంది. నిజంగా రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే విధానాల్లో రావలసిన మార్పులేమిటి?
  • సరైన చర్యలు తీసుకుంటే రాబోయే అయిదారేళ్లలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చు. వ్యవసాయ ఉత్పాదకత పెంచాలి. కాయధాన్యాలకు తోడుగా ఇతర పంటలూ పెంచాలి. పళ్లు, కూరగాయలు, చేపలు, మాంసం, పాలు, నూనెగింజలు, పప్పుదినుసులపై దృష్టిపెట్టాలి. సాగునీటి సౌకర్యాలను పెంచడం ద్వారా.. ఒక పంట స్థానంలో రెండు పంటలు వేయించాలి. గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ సేవారంగాలతో రైతు కుటుంబాలకు మంచి ఆదాయం వస్తుంది. వ్యవసాయ ఎగుమతులను పెంచాలి. అయిదారేళ్లలో రెట్టింపు ఎగుమతులు లక్ష్యం కావాలి.
  • దేశంలో వ్యవసాయం అంటేనే కష్టాలనే ముద్ర పడింది. యువత కూడా ఈ రంగంలోకి రావాలంటే ఏం జరగాలి?
  • దేశంలో ఇప్పటికీ వ్యవసాయం.. అనుబంధ రంగాలపై దాదాపు 40-50% మంది ఆధారపడి బతుకుతున్నారు. అందువల్ల ఈ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలి. వ్యవసాయ అనుబంధ వ్యాపారాలకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఈ రంగంలో అంకురసంస్థలను ప్రోత్సహించాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలి. వ్యవసాయంలోనూ ఆదాయాలు వస్తే.. దానిపట్ల అందరి దృక్పథం మారుతుంది.

ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్​ కలర్ పట్టాదార్ పాస్​బుక్​: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details