డ్రగ్స్ కేసు(Tollywood drugs case)లో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ(enforcement directorate) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గత పది రోజులుగా విచారణ బృందం సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటీమణులు చార్మి, రకుల్‌ప్రీత్ సింగ్, నటులు రాణా, నందు, రవితేజతో పాటు మత్తు మందు సరఫరాదారులు కెల్విన్, వాహిద్‌లను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వారి ఖాతాల్లో అనుమానస్పదంగా ఉన్న లావాదేవీలపై అడిగి తెలుసుకున్నారు. కెల్విన్, వాహిద్ ఎంత కాలంగా తెలుసు వారి నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేశారా, నగదు బదిలీ ఏ విధంగా చేశారు, ఎంత నగదు చెల్లించారు... అనే విషయాలపై ఈడీ అధికారులు లోతుగా ఆరా తీశారు.
కెల్విన్, వాహిద్ బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించిన ఈడీ... వాటిలో అనుమానస్పద లావాదేవీలను గుర్తించారు. రాణిగంజ్‌లోని ఓ బ్యాంకు ఖాతాలో అనుమానస్పద లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తున్న ఈడీ అధికారులు... లావాదేవీల వివరాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరారు. ఖాతా వివరాలపై స్పష్టత వచ్చాక మరికొంత మందికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరే అవకాశం ఉంది.