తెలంగాణ

telangana

ETV Bharat / city

విభజన సమస్యలపై కేంద్రం భేటీలో కుదరని ఏకాభిప్రాయం - విభజన సమస్యలపై ముగిసిన కేంద్రం ప్రత్యేక సమావేశం

bifurcation Issues
bifurcation Issues

By

Published : Sep 27, 2022, 1:12 PM IST

Updated : Sep 27, 2022, 7:13 PM IST

13:09 September 27

విభజన సమస్యలపై ముగిసిన సమావేశం.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే..

Bifurcation Issue Meet: విభజన సమస్యలపై...కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో దిల్లీలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఉభయ రాష్ట్రాల మధ్య వివాదాలపైనా చర్చించారు. షెడ్యూల్‌ 9లో ఉన్న 91 సంస్థల విభజన విషయంలో షీలా బిడే కమిటీ సిఫార్సులపై... న్యాయ సలహా తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఈ కమిటీ సిఫార్సులను... తెలంగాణ ఒప్పుకోవడం లేదన్న కేంద్రం... న్యాయ నిపుణుల సలహా తర్వాత...నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

విభజన చట్టం ప్రకారం సింగరేణిని పంచాలని ఏపీ ప్రభుత్వం కోరగా...తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. 51 శాతం ఈక్విటీని పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్నందున సింగరేణి విభజన అంశం ఉత్పన్నం కాదని పేర్కొంది. సింగరేణికి ఉన్న ఏకైక అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈల్‌లో మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు ఈక్విటీ వర్తిస్తుందని తెలుపగా... ఈ విషయాన్ని పరిశీలించాలని అధికారుల్ని హాంశాఖ కార్యదర్శి ఆదేశించారు. విభజన చట్టంలో పేర్కొనని 12 సంస్థలనూ విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా... తెలంగాణ పూర్తిగా వ్యతిరేకించింది. ప్రతి విషయంలో అభ్యంతరాలు, అవాంతరాలు సృష్టించుకుంటూ పోతే... విభజన సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని కేంద్రం పేర్కొంది.

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధుల విభజన, ఉమ్మడి సంస్థలపై వ్యయం, విదేశీ సహాయంతో కూడిన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రభుత్వ రుణాలకు సంబంధించిన మూడు అంశాలపై చర్చ జరిగింది. ఆ మూడు అంశాలు పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాలు, కేంద్రం కాగ్‌ సహకారం తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధుల విడుదల ఆలస్యం అవుతుందని తెలంగాణ లేవనెత్తగా... సమస్య పరిష్కరించాలని ఆర్ధిక శాఖ అధికారులను హోం శాఖ కార్యదర్శి ఆదేశించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని నిర్దేశించారు. కాజీపేట్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వేగవంతమైన చర్యలను కాజీపేట్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యల్ని వేగవంతం చేయాలని రైల్వే శాఖకు కేంద్రం సూచించింది. విభజన చట్టంలో పన్నులకు సంబంధించి పేర్కొన్న 50, 51, 56 సెక్షన్లలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చట్టాలన్ని సవరించాలని ఎపి ప్రభుత్వం కోరగా... ఎనిమిదేళ్ల తర్వాత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 27, 2022, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details