Andhra pradesh flood news: ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పెద్దపప్పురు మండలం జూటూరు సమీపంలోని పెన్నానదిని దాటుతూ.. కూలీలతో వెళుతున్న ఓ ఐచర్ వాహనం అదుపుతప్పి పెన్నా నదిలోకి ఒరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని స్థానికులు, జేసీబీ సాయంతో వాహనంతో పాటు కూలీలను బయటకు తీసి రక్షించారు. పెద్దపప్పురు మండలం పెండెకళ్లు గ్రామానికి చెందిన 30 మంది వ్యవసాయ కూలీలు యల్లనూరు మండలంలో పనులు నిమిత్తం ఐచర్ వాహనంలో బయల్దేరారు. జూటూరు గ్రామ సమీపంలోని పెన్నానది వద్దకు రాగానే నీటి ప్రవాహానికి ఐచర్ వాహనం అదుపుతప్పి ముందు భాగం నదిలోకి ఒరిగిపోయింది. నదిలోకి పడిపోయేలా ఉన్న వాహనాన్ని చూసి గట్టిగా కేకలు వేయగా గమనించిన స్థానికులు వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఘటనా సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేశారు.
రంగంలోకి దిగిన అధికారులు
అల్ప పీడనం వల్ల వారం రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల(AP floods rescue 2021) కారణంగా.. ఏపీలోని చెరువులు, వాగులు, వంకల్లో ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం లింగాలలో ప్రవహిస్తున్న వాగులో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు. ద్విచక్రవాహనంపై వెళుతుండగా.. గ్రామంలోని హైస్కూల్ వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు కింద ఉన్న వాగులోకి జారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వెంటనే ఈ సమాచారాన్ని గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మార్వో శేషారెడ్డి, ఎంపీడీవో సురేంద్ర నాథ్, ఎస్సై రుషీకేశవ రెడ్డి, పోలీసులు స్థానికుల సహకారంతో ఆ వ్యక్తిని కాపాడారు. తన ప్రాణాలు కాపాడిన అధికారులకు బాధితుడు ప్రతాపరెడ్డి కృతజ్ఞతలు తెలిపాడు.