అఫ్గాన్ నుంచి వెళ్లిపోవాలనే ప్రయత్నంలో కాబుల్ విమానాశ్రయానికి భారీగా తరలివస్తున్నారు అక్కడి ప్రజలు. ఈ క్రమంలో గత సోమవారం విమానాశ్రయంలో విదేశీ బలగాలు చేసిన కాల్పులు, తొక్కిసలాటలో మొత్తం 40 మంది మృతి చెందినట్లు తాలిబన్ కమాండర్ తెలిపారు. విదేశాలకు వెళ్లటంపై వదంతులు నమ్మొద్దని, విమానాశ్రయానికి రావొద్దని పిలుపునిచ్చారు. అఫ్గానిస్థాన్‌లో శాంతిస్థాపనకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నామని తాలిబన్లు ప్రకటించారు.
" విదేశీ విమానాలకు వేలాడొద్దు. సోమవారం విమానాశ్రయంలో జరిగిన కాల్పుల్లో 30-40 మంది మరణించారు. ఎవరి ఇంటిలో వారు ఉండాలి. ఎవరికీ హాని లేదు."
- మొహిబుల్లా హెక్మత్, తాలిబన్ కమాండర్.
అమెరికా సహా ఇతర దేశాలు తమ పౌరులను తిరిగి తీసుకెళ్లేందుకు విమానాలు పంపిస్తున్నాయి. మంగళవారం సైతం కాబుల్ విమానాశ్రయానికి అఫ్గాన్ పౌరులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ప్రజలు ఎవరూ రావొద్దని తాలిబన్లు ప్రకటన చేశారు.
అఫ్గాన్‌లోని కాబుల్ విమానాశ్రయంలో కాల్పులు, తొక్కిసలాట విమాన చక్రాలపై మృతదేహం
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ నుంచి గత ఆదివారం కతార్ వెళ్లిన అమెరికా వాయుసేన విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్ చక్రాలపై ఓ వ్యక్తి మృతదేహం లభించినట్లు అగ్రరాజ్య ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. అయితే.. ఎంత మంది చనిపోయారనే విషయం తెలియదని పేర్కొంది. 'అమెరికా వాయుసేన సీ-17 గ్లోబ్‌మాస్టర్-3 బలగాల ఉపసంహరణకు కావాల్సిన వస్తువులతో గత ఆదివారం కాబుల్‌లోని హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అందులోని వస్తువులను దింపేలోపే.. వందల మంది విమానాన్ని చుట్టుముట్టారు. పరిస్థితులు గందరగోళంగా మారిన క్రమంలో వీలైనంత త్వరగా విమానాన్ని సిబ్బంది టేకాఫ్ చేశారు.' అని పేర్కొంది.
దేశం నుంచి ఎలాగైనా వెళ్లిపోవాలని కాబుల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. రెక్కల కింద వేళాడుతూ టేకాఫ్ అయిన తర్వాత ముగ్గురు కిందపడినట్లు ఓ వీడియో వైరల్‌గా మారిన తర్వాత.. ఈ మృతదేహం దొరకటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి:తాలిబన్ 2.0 అరాచకాలు షురూ- విగ్రహం ధ్వంసం