కరోనా మహమ్మారిబారిన పడుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. అందులోనూ పురుషులే అధికంగా ఉంటున్నారు. వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్.. ఆ విషయాన్నే తేటతెల్లం చేస్తోంది. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 47.1శాతం మందికి కరోనా సోకుతోంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో పురుషులు 65.6 శాతం మంది ఉన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేత అనంతరం ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం బయటకు వెళ్లకతప్పని పరిస్థితి నెలకొంది. ఈ కారణాలతో యువత ఎక్కువగా వైరస్‌బారిన పడుతున్నట్లుగా వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు తెరవనందున 20 ఏళ్ల లోపు వారు ఇంట్లోనే ఉంటున్నారు. 61 ఏళ్ల పైబడిన వారిలో రాకపోకలు కొనసాగించేవారుతక్కువ. ఆ కారణం వల్ల.. బయట తిరగడానికి అవకాశమున్న 21-60 మధ్య వయస్కుల వారు వైరస్ బారిన పడుతున్నారు. వారి ద్వారానే చిన్నారులు, వృద్ధులకు కరోనా వ్యాప్తి చెందుతోంది. తప్పనిసరిగా బయటకు వెళ్లేవారు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో 75.1 శాతంగా...
రాష్ట్రంలో నమోదైన మొత్తం 480 మరణాల్లో కేవలం కొవిడ్ కారణంగా మృతి చెందిన వారు 46.13 శాతం కాగా.. కరోనాతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు 53.87 శాతంగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వ్యాధి నుంచి కోలుకున్న వారి జాతీయ సగటు 64 శాతంగా ఉండగా రాష్ట్రంలో 75.1 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 8 వేల 416 పడకలకు 2 వేల 242 పడకల్లో రోగులకు సేవలందిస్తున్నారు. మరో 6, 204 అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు బోధనాస్తుపత్రుల్లోనివి కలిపి మొత్తంగా 14 వేల 839 పడకలు అందుబాటులో ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని 55 ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ సేవలు అందుబాటులో ఉండగా... వాటిల్లో 4 వేల 497 పడకలున్నాయి.