సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో తెలంగాణ పనితీరు భేష్ రానున్న ఐదేళ్ల కోసం వివిధ రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, గ్రాంట్లకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నివేదిక సమర్పించింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రంగాల స్థితిగతులను ప్రస్తావించిన కమిషన్.. కొన్ని సిఫారసులు చేసింది. దేశ సగటు తలసరి ఆదాయం లక్షా 40 వేల 422 రూపాయలు ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 25 వేల 47 రూపాయలుగా ఆర్థిక సంఘం పేర్కొంది. 2017 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 0.8 శాతం పెరిగినట్లు తెలిపింది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో..
నీతి ఆయోగ్ నిర్ధేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 67 పాయింట్లతో రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచింది. ఆరోగ్యం, డీసెంట్ వర్క్, ఆర్థికాభివృద్ధి, అసమానతల తగ్గింపు సూచికల్లో తెలంగాణ ముందుందని తెలిపింది. 2018-19లో తెలంగాణ మొత్తం రెవెన్యూలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు 27 శాతం లోపే ఉన్నాయని, అంటే రాష్ట్రం ఎక్కువగా సొంత నిధులపైనే ఆధారపడిందని తెలిపింది. పన్ను, పన్నేతర ఆదాయాల్లో ఇదే ఒరవడిని కొనసాగించాలని సూచించింది.
ముందంజ..
కీలకమైన వైద్య, ఆరోగ్య సూచికల్లో రాష్ట్రం జాతీయ సగటు కంటే ముందుంది. చిన్నారుల మరణాలు, వ్యాక్సినేషన్, ప్రసూతి మరణాలు తదితరాల్లో జాతీయ సగటు కంటే రాష్ట్రం మెరుగ్గా ఉంది. టీఎస్ఐపాస్, టీహబ్ లాంటి పెట్టుబడిదారుల ప్రోత్సాహక విధానాలను అమలు చేస్తోందని, సరళతర వాణిజ్య విధానంలో ముందంజలో ఉందని ఆర్థిక సంఘం తెలిపింది.
భూరికార్డుల ప్రస్తావన..
మహారాష్ట్రతో పాటు తెలంగాణ మాత్రమే 90 శాతం భూ రికార్డులను కంప్యూటరీకరించిందని పేర్కొంది. తద్వారా డీబీటీ ద్వారా నగదు బదిలీ సులభమైందని తెలిపింది. రెవెన్యూలోటు, రుణాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక సంఘం సూచించింది. అదనపు రుణాలు తీసుకున్నప్పటికీ జీఎస్డీపీలో అప్పుల శాతం పరిమితికి లోబడే ఉందని తెలిపింది.
కాళేశ్వరంపై..
80 వేల కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని.. అయితే ప్రాజెక్టు నిర్వహణ కోసం అవసరమయ్యే వ్యయం కోసం యూజర్ ఛార్జీల తరహాలో రెవెన్యూ సమకూర్చుకోవాలని సూచించింది. చెల్లించాల్సిన రుణాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి పటిష్ఠ విధానాన్ని అమలు చేయాలని సూచించింది.
విద్యలో వెనుకంజ..
రాష్ట్రంలోని కేవలం నాలుగు జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి నుంచే జీఎస్డీపీలో 52 శాతం సమకూరుతోందని కమిషన్ వివరించింది. అన్ని జిల్లాల్లో సమతుల అభివృద్ధి ఉండేలా ఇతర పట్టణ ప్రాంతాల్లోనూ అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని సూచించింది. 15 ఏళ్లు ఆపైబడిన వారిని పరిశీలిస్తే 2017-18 నిరుద్యోగం అంశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఆర్థిక సంఘం తెలిపింది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించేలా ఆయా రంగాలను ప్రోత్సహించాలని సూచించింది. విద్య విషయంలో జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణ వెనకంజలో ఉందని, విద్యపై చేస్తున్న వ్యయం కూడా తక్కువగా ఉందని ఆర్థిక సంఘం తెలిపింది.
ఇవీచూడండి:కుదేలైన దేశానికి ఆర్థిక టీకా- ఏ రంగానికి ఎంత?