గతేడాది రబీలో రాష్ట్రవ్యాప్తంగా 45.53 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఈ ఏడాది వర్షాలు దండిగా కురిసినందున సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశముందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈ సీజన్‌లో మొత్తం 14.41 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. వీటిలో 6.50 లక్షల క్వింటాళ్లు ప్రభుత్వ సంస్థల వద్ద అందుబాటులో ఉన్నాయి. మిగతావి ప్రైవేటు సంస్థలు అమ్మకానికి పెట్టాయి.
యాసంగికి విత్తనాలు సిద్ధం.. 6.50 లక్షల క్వింటాళ్లు పంపిణీ - telangana state seeds development organization
ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వ సంస్థలు సిద్ధం చేశాయి. మొత్తం 6.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీకి సిద్ధం చేసినట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్ సీడ్స్) తాజా నివేదికలో వెల్లడించింది.
టీఎస్ సీడ్స్ ఇప్పటికే గ్రామాలకు విత్తనాలను పంపి అమ్మకాలను ప్రారంభించింది. ప్రధానంగా సెనగ, వేరుసెనగ, వరి విత్తనాలకు ఈ సీజన్‌లో డిమాండ్ అధికంగా ఉంటుందని విత్తన కంపెనీలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో రబీలో పండే వేరుసెనగ పంట విత్తనాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకే ఈ సీజన్‌లో వేరుసెనగ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
రాయితీ ఇక లేనట్టే..
సాధారణంగా రబీలో ప్రభుత్వ సంస్థలు విక్రయించే విత్తనాలపై రాష్ట్ర ప్రభుత్వం కొంత రాయితీని భరిస్తుంది. ఈ సీజన్‌లో రాయితీపై ఏమీ తేల్చనందున టీఎస్‌సీడ్స్ పూర్తి ధరకు విక్రయిస్తోంది. రాయితీ లేకుండా విక్రయిస్తే ప్రభుత్వ సంస్థల వద్ద రైతులు కొంటారా? అనే అనుమానాలు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు విత్తన కంపెనీలు తక్కువ ధరలకే ఇస్తామంటూ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నందున వాటి నుంచి పోటీని తట్టుకోలేక టీఎస్‌సీడ్స్ కూడా ధర తగ్గించి అమ్ముతోంది.