పది దాటితే పడిగాపులే... - late night
వారాంతంలో రాత్రి పది దాటితే ఆర్టీసీ బస్సుల కోసం భాగ్యనగర వాసులకు ఎదురుచూపులు తప్పడంలేదు. గంటల తరబడి చూసినా ఒకటి అరా బస్సులు వస్తున్నాయని.. అవి కూడా పూర్తిగా నిండిపోతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భాగ్యనగర వాసులకు బస్సులు కరువవుతున్నాయి. వారాంతాల్లో కాస్త చీకటి పడిందంటే చాలు.. బస్సుల సంఖ్య తగ్గిపోతోంది. 24 గంటలూ జనాలు రాకపోకలు సాగించే మైత్రివనం - బోరబండ - హైటెక్ సిటీ రూట్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంటోంది. లక్డీకాపూల్ - బంజారాహిల్స్, రాంనగర్ - లక్డీకాపూల్ మార్గంలోనూ ఇదే పరిస్థితి. రాత్రి పది తర్వాత ఈ మార్గాల్లో బస్సులు చాలా అరుదుగా వస్తుంటాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి బస్సులు రాకపోవడం ఒక సమస్య అయితే... బస్ షెల్టర్ల వద్ద ప్రైవేట్ వాహనాలు తిష్ఠ వేస్తుండడం ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. కొన్నిసార్లు ఆటోవాలాలు కాళ్లపై నుంచి తీసుకెళ్లిన సందర్భాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలు ఆర్టీసీ బస్‌స్టాపుల్లో ఉండొద్దని సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా.. ప్రయోజనం లేదంటున్నారు. ప్రైవేట్ వాహనాల్లో రాత్రివేళ ప్రయాణించడం భయంగా ఉంటోందని.. అయినా ఇంటికి చేరాలంటే తప్పడం లేదని భాగ్యనగర వాసులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి పదిగంటల తర్వాత కూడా ఆర్టీసీ సర్వీసులను నడపాలని నగర ప్రజలు కోరుతున్నారు.