Flood to Irrigation projects: రాష్ట్రంతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. జోరువానలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. 2లక్షల 25వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శుక్రవారం 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఇవాళా దాదాపుగా 2లక్షల50వేలకు పెరిగింది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 43 టీఎంసీలు నీటినిల్వ ఉంది.
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో... 20 గేట్లు ఎత్తి లక్షకుపైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 15టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది. కడెం నారాయణ రెడ్డి జలాశయం నిండుకుండలా మారింది. భారీగా వరదప్రవాహంతో... 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కడెం పూర్తిస్థాయి నీటిమట్టం 7టీఎంసీలు కాగా... ప్రస్తుతం 6టీఎంసీలకు పైగా నిల్వ ఉంది.
గోదావరితో పాటు ప్రాణహిత ప్రవాహ ఉద్ధృతితో... కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు వరద పోటెత్తుతోంది. లక్ష్మీ-మేడిగడ్డ బ్యారేజీకి దాదాపుగా 4లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో 57 గేట్లు ఎత్తి 4లక్షలకు పైగా క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పార్వతి, సరస్వతి బ్యారేజీలకు కూడా ఎగువ నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. రానున్న అయిదారు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టు నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు నదిలో లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండే అవకాశాలు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది.