Basara RGUKT Update: బాసర రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వ విద్యాలయంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఆరో రోజు కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఎండ, వానని సైతం లెక్కచేయకుండా తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
విద్యార్థుల నిరసన విరమింపజేసేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు శనివారమంతా చేసిన ప్రయత్నం విఫలమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు ప్రకటించారు. చివరకు మంత్రి, అధికారులు... మంత్రి సబితా ఇంద్రారెడ్డి ద్వారా ఓ లేఖ విడుదల చేయించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని... ఆందోళన విరమించాలని, మంత్రిగా కాకుండా ఒక తల్లిగా ఆవేదన చెందుతున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు. అయినా విద్యార్థులు తమ డిమాండ్లకే కట్టుబడటంతో మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు విద్యాలయం నుంచి వెనుదిరిగారు.