వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు (ఏడీ) మంగీలాల్ అక్రమాలపై ఆ శాఖలో అంతర్గత విచారణ మొదలైంది. మంగీలాల్ అవినీతి కారణంగా 2012 ఫిబ్రవరి 17న తొలుత వ్యవసాయశాఖ సస్పెండ్ చేసింది. తిరిగి 2015 ఆగస్టు 25న సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు కీలక పోస్టు ఇవ్వవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను తుంగలో తొక్కి కమిషనర్ కార్యాలయం ఆయనను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఏడీగా నియమించింది. పైగా ఆ జిల్లా వ్యవసాయాధికారిగా అదనపు బాధ్యత కూడా అప్పగించింది.
కలెక్టర్ సిఫార్సు చేసినా చర్యలు శూన్యం..
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ నివాస భవనం ఆవరణలో సేంద్రియ కూరగాయల సాగు పేరిట మంగీలాల్ సొమ్ము దుర్వినియోగం చేశారని, రైతులకు ఇవ్వాల్సిన సొమ్మును తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారని ఆరోపణలున్నాయి. అప్పటి కలెక్టర్ దివ్య దేవరాజన్ 2020 ఫిబ్రవరి 3న ఆయనను వ్యవసాయశాఖకు సరెండర్ చేస్తూ క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. కలెక్టర్ సూచనలను పక్కనపెట్టి, ఆయనకు కరీంనగర్ రైతు శిక్షణ కేంద్రంలో పోస్టింగ్ ఇచ్చారు. సంగారెడ్డిలోనూ ఓ అధికారిని అప్పటి కలెక్టర్ సరెండర్ చేస్తే ఆయనను మహబూబ్‌నగర్‌లో నియమించారు. అక్కడా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులొచ్చినా, చర్యలు శూన్యం.
రెండు వర్గాల గొడవలు..
కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయి, అక్రమాలకు కొమ్ముకాస్తున్నారు. దీనివల్లనే సీనియారిటీ వివాదం తలెత్తి కొన్నేళ్లుగా పదోన్నతులు ఆగిపోయాయి. పదోన్నతులు రాకుండా అడ్డుకుంటున్నవారే ఖాళీగా ఉన్న పెద్ద పోస్టుల్లో కిందిస్థాయి అధికారులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇప్పిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. జిల్లా వ్యవసాయాధికారి పోస్టు సంయుక్త సంచాలకుని (జేడీ) స్థాయిది. ఏడీకన్నా రెండు స్థానాలపైన ఉండే ఈ కీలకపోస్టులో ఇన్‌ఛార్జిగా మంగీలాల్ నియామకం ఇలాంటిదే. 18 జిల్లా వ్యవసాయాధికారి పోస్టుల్లో ప్రస్తుతం ఇలా కిందిస్థాయి ఉద్యోగులే ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. ఈ వ్యవహారాలపై వ్యవసాయ శాఖ కమిషనర్, కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డిని వివరణ అడగ్గా మంగీలాల్ నిధులు స్వాహా చేసిన లింగాకర్షకబుట్టల కుంభకోణంపై అంతర్గత విచారణ సాగుతోందని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా కఠిన చర్యలుంటాయని వివరించారు.