Adilabad Mlc Election:ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత నెలకొంది. నామపత్రాలు సమర్పించిన 24 మందిలో.. 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థిగా దండె విఠల్, తుడుందెబ్బ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పరాణి నామినేషన్ వేశారు.
పుష్పరాణి నామినేషన్ ఉపసంహరించుకుందని ఎన్నికల అధికారులకు సంపత్ అనే వ్యక్తి చెప్పారు. అయితే నామపత్రంలో ప్రతిపాదించిన పేర్లలో సంపత్ పేరు లేకపోవడంతో ఎన్నికల అధికారి అభ్యంతరం తెలిపారు. ఉపసంహరణపై పుష్పరాణితో ఫోన్ చేయించాలని సూచించారు.
కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..
Local Body Quota MLC Elections: ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణి వచ్చారు. తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బరిలో నిలిచినట్లు ప్రకటించారు.. పుష్పరాణి. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెరాస, తుడుందెబ్బ, భాజపా శ్రేణుల పోటాపోటీ నినాదాలు చేశాయి. ఫలితంగా కలెక్టరేట్ వద్ద తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దాంతో పాటు పుష్పరాణిని అక్కడి నుంచి పంపేందుకు పోలీసుల యత్నించారు. అయితే ఆమెను తరలించకుండా తుడుందెబ్బ, భాజపా శ్రేణులు అడ్డుకున్నారు.
పుష్పరాణి అభ్యంతరం..
రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తెరాస అభ్యర్థి విఠల్, అనుచరులు ఉన్నారని.. కానీ తనను లోపలికి అనుమతించడం లేదంటూ పుష్పరాణి అభ్యంతరం తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు కావడం.. పరిస్థితి ఉత్కంఠగా మారడంతో ఏం జరుగుతుందోనని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జోగు రామన్న, కోనేరు కోనప్ప ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలోనే వేచిచూశారు.
అధికారుల ప్రకటన...
నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియడంతో ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు. తెరాస అభ్యర్థిగా దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి బరిలో నిలిచినట్లు ప్రకటించారు.
ఇదీచూడండి:MLC ELECTIONS 2021: ముగిసిన ఉపసంహరణ గడువు.. సగం స్థానాల్లో ఏకగ్రీవం..