ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది రెవెన్యూ ఉద్యోగుల కనుసన్నల్లో సాగుతున్న అవినీతి వ్యవహారం... షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకం ప్రతిష్ఠ మసకబారేలా చేస్తోంది. బోథ్, సిరికొండ, గుడిహత్నూర్, నేరడిగొండ, జైనథ్ మండలాలతోపాటు ఆదిలాబాద్ పురపాలికలో కోట్లలో అవినీతి జరిగినట్లు వెల్లడవుతోంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న కొంతమంది మీసేవా కేంద్రాలే వేదికగా సైబర్‌నేరాలకు పాల్పడటం... రెవెన్యూ ఉద్యోగుల చేతివాటాన్ని వెల్లడిస్తోంది. జిల్లాకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తులను సైతం తెలంగాణవాసులుగా చిత్రీకరిస్తూ... ప్రభుత్వ డబ్బులను కాజేసే ప్రయత్నం చేయడం అర్హులైన లబ్ధిదారులకు నష్టం చేకూరుస్తోంది.
జైనథ్ మండలం అందె నర్సవ్వ-అందె దేవన్న కూతురు లక్ష్మి వివాహం ఏడాది కిందట మే 8న జరిగింది. అప్పట్లోనే కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోగా అదే ఏడాది నవంబర్ 25న ప్రభుత్వం లక్షా 116 రూపాయలు మంజూరు చేసింది. రెవెన్యూ సిబ్బంది లబ్ధిదారులకు ఏడాదిగా డబ్బులు ఇవ్వకపోగా మంజూరు కాలేదంటూ నమ్మించే ప్రయత్నం చేయడం అక్రమాలను చాటిచెబుతోంది. మహారాష్ట్రలోని కిన్వట్, బోరి, చంద్రపూర్‌లాంటి గ్రామాల మహిళలను ఆదిలాబాద్ వాసులుగా చిత్రీకరించి డబ్బులు డ్రా చేసిన ఘటనలు వెలుగుచూడగా సిరికొండ, ఇచ్చోడ, బోథ్, గుడిహత్నూర్ మండలాల్లో.. మీసేవా కేంద్రాల్లో బినామీ పత్రాలు సృష్టించి అవినీతికి తెరలేపడం కలకలం సృష్టిస్తోంది.