Will Petrol and Diesel Price Decrease in India :ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సహా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ...వంటగ్యాస్ ధర సిలిండర్‌కు 200 రూపాయలు తగ్గించిన కేంద్రం త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు అందరి ఆశలు పెట్రోల్, డీజిల్‌పైకి మళ్లాయి. గ్యాస్ ధర తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగిరావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి వాహన ఇంధన ధరల కోత కూడా తోడైతే అన్ని నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలనూ కేంద్రం తగ్గించే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ గ్రూప్ అంచనా వేసింది. రాబోయే పండగల సీజన్‌తో పాటు వరుస ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పెట్రో ధరల తగ్గింపుపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని సిటీ గ్రూప్ తెలిపింది. వంట గ్యాస్ ధర తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ఇటీవల టమాటాల ధరలు దిగివచ్చిన నేపథ్యంలో సెప్టెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. జులైలో 15 నెలల గరిష్ఠానికి చేరిన నిత్యావసరాల ధరలు తగ్గుముఖం పట్టేందుకు కేంద్రం అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెప్పారు. తాజాగా గ్యాస్ ధర తగ్గించడం అందులో భాగమేనని వివరించారు. దేశీయంగా పెరిగిన ధరలను తగ్గించడానికి ఇప్పటికే బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ చర్యలకు పెట్రో ధరల తగ్గింపు కూడా జత అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందని ఆశిస్తున్నారు.